Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Hijack: పాకిస్తాన్‌లో రైలు హైజాక్.. 104 మంది బందీలకు విముక్తి..!

పాకిస్తాన్‌లో బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ విరుచుకుపడింది. క్వెట్టా నుంచి పెషావర్‌ వస్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్‌ చేసి దుశ్చర్యకు పాల్పడింది. 214 మంది భద్రతా సిబ్బందిని బంధించిన బలూచిస్తాన్‌ మిలిటెంట్లు.. 30 మంది పాక్‌ సైనికులను కాల్చిచంపినట్లు ప్రకటించడం కలకలం రేపుతోంది. మరోవైపు, BLA - పాక్ సైన్యం మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

Train Hijack: పాకిస్తాన్‌లో రైలు హైజాక్.. 104 మంది బందీలకు విముక్తి..!
Pakistan Train Hijack
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 12, 2025 | 7:25 AM

పాకిస్తాన్‌లో బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ విరుచుకుపడింది. క్వెట్టా నుంచి పెషావర్‌ వస్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్‌ చేసి దుశ్చర్యకు పాల్పడింది. 214 మంది భద్రతా సిబ్బందిని బంధించిన బలూచిస్తాన్‌ మిలిటెంట్లు.. 30 మంది పాక్‌ సైనికులను కాల్చిచంపినట్లు ప్రకటించడం కలకలం రేపుతోంది. ఇంతకీ.. పాక్‌ ట్రైన్‌ను బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ఎందుకు హైజాక్‌ చేసింది..? ట్రైన్‌ హైజాక్‌ విషయంలో బలూచిస్తాన్‌ మిలిటెంట్ల డిమాండ్స్‌ ఏంటి..?

పాకిస్థాన్‌లో రైలు హైజాక్‌కు గురైన ఘటనలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌ కొనసాగుతోంది. బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ అదుపులో ఉన్న బందీల్లో 104 మందిని సైనిక బలగాలు సురక్షితంగా విడిపించాయి. వీరిలో పురుషులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. మిలిటెంట్ల అదుపులో ఇంకా వంద మందికి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. పాక్‌ బలగాలు, మిలిటెంట్ల మధ్య కాల్పులు కొనసాగుతుండగా.. ఇప్పటివరకు జరిగిన కాల్పుల్లో సుమారు 13 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు పాక్‌ ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. అయితే, మరోవైపు, BLA – పాక్ సైన్యం మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

బలూచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి పెషావర్‌కు జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిన్న ఉదయం 9గంటలకు బయలుదేరింది. సుమారు 500 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలుపై.. రిమోట్‌ ప్రాంతమైన బలోన్‌లో 8వ నంబర్‌ టన్నెల్‌ దగ్గర మిలిటెంట్లు కాల్పులు జరిపారు. రైలు ట్రాక్‌ను పేల్చివేసి ట్రైన్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది. తమ దగ్గర 214 మంది బందీలుగా ఉన్నట్లు తెలిపిన మిలిటెంట్‌ సంస్థ.. 30 మంది పాక్‌ సైనికులను చంపినట్లు పేర్కొంది. అయితే.. తమపై మిలిటరీ ఆపరేషన్‌ చేపడితే బందీలుగా ఉన్నవారందరినీ చంపుతామని బెదరించింది. బందీలను విడిచిపెట్టాలంటే.. బలోచ్‌ రాజకీయ నేరస్థులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీనికోసం పాక్‌ ప్రభుత్వానికి 48 గంటల గడువు విధించింది.

ఇక.. ట్రైన్‌ హైజాక్‌తో వెంటనే అప్రమత్తమైన పాక్‌ ప్రభుత్వం.. ఘటనాస్థలానికి భద్రతా బలగాలను పంపించింది. రంగంలోకి దిగిన సైనికులు.. మిలిటెంట్లపై కాల్పులకు దిగారు. వైమానిక, డ్రోన్‌ దాడులు చేపట్టి 80 మంది బందీలను విడిపించారు. అటు.. పాక్‌ సైన్యం చేపట్టిన దాడిని తాము తిప్పికొట్టామని బలూచిస్తాన్‌ మిలిటెంట్లు ప్రకటించారు. ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే.. ఇరాన్- అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో వ్యాపించి ఉన్న బలూచిస్థాన్‌.. పాకిస్థాన్‌ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని కోరుతూ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. గ్యాస్‌, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతమైనప్పటికీ.. దోపిడీకి గురవుతున్నామని వాదిస్తోంది. ఈ క్రమంలోనే.. బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పేరుతో 2000లో ఏర్పాటైన సంస్థ.. స్థానికంగా బలీయ శక్తిగా ఎదిగింది. పాక్‌ సైన్యం, ప్రభుత్వంపై తరచూ దాడులకు పాల్పడుతున్న ఈ సంస్థను పాకిస్థాన్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌లు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి.

కొన్ని రోజుల క్రితం, బలూచ్ గ్రూపులు పాకిస్తాన్ – చైనాపై కొత్త దాడిని ప్రకటించాయి. బలూచ్ యోధులు ఇటీవల సింధీ వేర్పాటువాద గ్రూపులతో విన్యాసాలు ముగించారు. ఇప్పుడు తిరుగుబాటు సంస్థలు పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. సింధీ, బలూచ్ సంస్థలు కలిసి రావడం వల్ల పాకిస్తాన్‌లోని CPEC ప్రాజెక్టులకు పెద్ద ముప్పు ఏర్పడింది.

గత నెలలో BRAS అంటే బలూచ్ రాజి ఆజోయ్ సంగర్ సమావేశం జరిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్, సింధీ లిబరేషన్ ఆర్గనైజేషన్, సింధుదేశ్ రివల్యూషనరీ ఆర్మీ కమాండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాకిస్తాన్‌పై ఒక పెద్ద ఆపరేషన్‌కు ప్రతిపాదన చేశారు. ఈ సమావేశం జరిగిన కొద్ది రోజులకే, పాకిస్తాన్‌లో రైలు హైజాక్ ద్వారా షాబాజ్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..