పాకిస్తాన్ లో బాంబు పేలుడు ఘటన, చైనా రాయబారిని టార్గెట్ చేశారా ? అధికారుల దర్యాప్తు

పాకిస్తాన్ లోని క్వెట్టా సిటీలో గల ఓ హోటల్ పార్కింగ్ ప్రదేశంలో గత బుధవారం జరిగిన బాంబు పేలుడు ఘటనలో 5 గురు మరణించగా సుమారు 12 మందికి పైగా గాయపడ్డారు..

పాకిస్తాన్ లో బాంబు పేలుడు ఘటన, చైనా రాయబారిని టార్గెట్ చేశారా ?  అధికారుల దర్యాప్తు
Pakistan Investigates Whether Attack Targetted China's Ambassador

Edited By: Anil kumar poka

Updated on: Apr 23, 2021 | 8:28 AM

పాకిస్తాన్ లోని క్వెట్టా సిటీలో గల ఓ హోటల్ పార్కింగ్ ప్రదేశంలో గత బుధవారం జరిగిన బాంబు పేలుడు ఘటనలో 5 గురు మరణించగా సుమారు 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ హోటల్ లో బస చేసిన చైనా రాయబారిని టార్గెట్ గా చేసుకునే ఈ పేలుడుకు పాల్పడ్డారా అని పాకిస్థాన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.నాంగ్ రాంగ్ అనే ఈ చైనా రాయబారి తమ దేశానికి చెందిన నలుగురు ప్రతినిధి బృంద సభ్యులతో సమావేశమై ఉండగా ఈ పేలుడు జరిగింది. డిన్నర్ మీటింగ్ నుంచి ఆయన బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తాజాగా అధికారులు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఏ గ్రూపు ప్రకటించుకోలేదు. దర్యాప్తు జరుగుతోందని, బహుశా ఇది ఉగ్ర దాడి అని భావిస్తున్నామని పాక్ హోమ్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అంటున్నారు. తమ ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇండియాను ఉద్దేశించే పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్య చేసినట్టు భావిస్తున్నారు.

బెలూచిస్థాన్ రాజధాని అయిన క్వెట్టా నగరంలోకి చైనా నుంచి కోట్లాది డాలర్లు ..చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా అందుతున్నాయి. అయితే ఈ చైనా సొమ్ము వల్ల తమకు ప్రయోజనం లేదని, తమ సహజ వనరులను పాక్ ప్రభుత్వం, ఆర్మీ దోచుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో తరచూ అక్కడ పాక్ ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు జోరందుకుంటున్నాయి. అటు విపక్షాలు కూడా ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. అటు- బాంబు పేలుడు ఘటనపై విచారం వ్యక్తం చేసిన చైనా ప్రభుత్వం..సాధ్యమైనంత  త్వరగా ఇందుకు బాధ్యులైనవారిని అరెస్టు చేయాలని  పాక్ ప్రభుత్వాన్ని కోరింది. తమ దేశ  రాయబారి క్షేమంగా ఉన్నందుకు హర్షం వ్యక్తం చేసింది.