
US Help to Pakistan: పాకిస్తాన్ భారీ వరదల దాటికి అతాలాకుతలమవుతోంది. గత కొద్దిరోజులుగా భారీ వరదలతో అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. దీంతో తమకు సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అడుగతోంది. ఐక్యరాజ్యసమితితో కలిసి విరాళాల కోసం అభ్యర్థిస్తోంది దాయాదిదేశం. పాకిస్తాన్ విజ్ఞప్తికి స్పందించిన అగ్రరాజ్యం అమెరికా 30 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ కష్టసమయంలో పాక్‌కు అండగా నిలబడతామని అమెరికా విదేశాంగమంత్రి అంటోనీ బ్లింకెన్ ప్రకటించారు.
పాకిస్తాన్ లో పాక్‌లో వరదల వల్ల దాదాపు 33 మిలియన్ల మంది నిరాశ్రయులైనట్లు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధుల్లో ఒకరైన వేదాంత్ పటేల్ వెల్లడించారు. దాదాపు 1,100 మంది మరణించినట్లు తెలిపారు. 1,600కు పైగా గాయపడ్డట్లు పేర్కొన్నారు. దాదాపు పది లక్షల నివాసాలు ధ్వంసమైనట్లు తెలిపారు. చాలా మందికి జీవనాధారమైన పశుసంపదను కోల్పోయినట్లు వెల్లడించారు. పెద్ద ఎత్తున రోడ్లు, 20 లక్షల ఎకరాల్లో పంట కొట్టుకుపోయినట్లు వెల్లడించారు. తాజాగా ప్రకటించిన ఆర్థిక సాయాన్ని తక్షణావసరమైన ఆహారం, పిల్లల పౌష్టికాహారం, తాగునీరు, ప్రజారోగ్య అవసరాలకు వినియోగించుకునేలా పాక్‌తో కలిసి అమెరికా పనిచేస్తుందని వేదాంత్ పటేల్ తెలిపారు. వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి అమెరికా ప్రతినిధులు పాకిస్థాన్‌కు ఇప్పటికే చేరుకున్నారు. పాక్‌లో వరదలు సృష్టించిన బీభత్సంపై పలువురు అమెరికా చట్టసభ ప్రతినిధులు సైతం విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో పాకిస్తాన్ ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..