Pakistan Floods: వరదలు, అంటు వ్యాధులతో పాక్‌ విలవిల.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

జల విలయానికి పాకిస్తాన్‌ కకావికలమైంది. ఎన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తడంతో అక్కడ మరణమృదంగం మోగుతోంది. అసలే ఆర్థిక పరిస్థితులు బాగా లేక కొట్టుమిట్టాడుతున్న ఆ దేశాన్ని వరదలు మరింత సంక్షోభంలోకి నెట్టుతున్నాయి.

Pakistan Floods: వరదలు, అంటు వ్యాధులతో పాక్‌ విలవిల.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
Pakistan Floods

Updated on: Sep 06, 2022 | 7:22 AM

జల విలయానికి పాకిస్తాన్‌ కకావికలమైంది. ఎన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తడంతో అక్కడ మరణమృదంగం మోగుతోంది. అసలే ఆర్థిక పరిస్థితులు బాగా లేక కొట్టుమిట్టాడుతున్న ఆ దేశాన్ని వరదలు మరింత సంక్షోభంలోకి నెట్టుతున్నాయి. ఏంతలా అంటే ప్రస్తుతం పాకిస్తాన్‌లోని మూడోంతుల్లో ఒక వంతు భూభాగం పూర్తిగా నీటితోనే నిండి ఉంది. సింధు నది దాని ఉపనదులు పొంగిపొర్లడం తీవ్రంగా నష్టం వాటిల్లింది. జూన్ మధ్య నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల 1,300 మంది మరణించారు. వరదల వల్ల 3.3 కోట్ల మంది ప్రజలు ప్రభావితం అయ్యారు.ఇప్పటికే తీవ్రమైన అప్పులు, ఆర్థిక సంక్షోభంలో ఉంది పాకిస్తాన్. ఈ వరదల వల్ల పాకిస్తాన్‌కు 10 బిలియన్ డాలర్ల నష్టం ఏర్పడింది. రోడ్డు, బ్రిడ్జిలు, కరెంట్ స్తంభాలు ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి. వ్యవసాయ భూములు కొట్టుకుపోయాయి. వరదల ధాటికి పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడ్డాయి. పాక్ సైన్యంతో పాటు అన్ని అధికారిక డిపార్ట్‌మెంట్ల అధికారులు వరద బాధితులకు సహాయం చేస్తున్నారు. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంక్వా, సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌లలో ప్రస్తుతం 5లక్షలకుపైగా ప్రజలు సహాయక శిబిరాల్లో నివసిస్తున్నారు.

కాగా గత 30 ఏళ్లలో పాకిస్తాన్ లో ఇలాంటి వరదలు రాలేదు. భారీ వరదల కారణంగా దేశంలో నేషనల్‌ ఎమర్జెన్సీని విధించింది అక్కడి ప్రభుత్వం. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లోని వరదలను 2005 అమెరికాలో సంభవించిన హరికెన్ కత్రినాతో పోలుస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ వరద కష్టాల నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ సహాయాన్ని కోరుతోంది. ఇప్పటికే యూఎన్ పాకిస్తాన్‌కు సహాయాన్ని ప్రారంభించింది. ఫ్రాన్స్, యూఏఈ, యూఎస్‌ఏ ఉజ్బెకిస్థాన్ తదితర దేశాలు కూడా పాక్‌కు సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..