హువాంగ్ వ్యవహారంతో ఊహించని పరిణామాలు.. ఎన్విడియా ఉద్యోగుల నుంచి మద్దతు
ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఎన్విడియా ఇష్యూలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. జెన్సన్ హువాంగ్ రాజీనామా వ్యవహారం ప్రపంచ టెక్ రంగంలో కలకలం రేపుతుండగా... చైనాకు అత్యాధునిక చిప్స్ ఎగుమతుల విషయంలో అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ వ్యవహారశైలి ట్రంప్ ప్రభుత్వంలోనే అసంతృప్తికి కారణమవుతోంది. లుట్నిక్‌ను పదవి నుంచి తప్పించాలనే చర్చలు మొదలయ్యాయి. ఇటు ఎన్విడియా ఉద్యోగుల నుంచి హువాంగ్‌కు అనూహ్యంగా మద్దతు లభిస్తోంది.

ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఎన్విడియా సీఈవో పదవికి హువాంగ్ రాజీనామా చేయడంతో కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. మరోవైపు అత్యంత శక్తిమంతమైన చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేయకుండా అడ్డుకోవడంలో అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ కాలయాపన చేయడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ కూడా లుట్నిక్ తీరును తప్పుపట్టారు. ఆయనను పదవి నుంచి తొలగించే అంశంపై వైట్ హౌస్‌లో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. లుట్నిక్ పదవిలో ఉండాలా? వద్దా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని రిపబ్లికన్ పార్టీ సెనెటర్ జాన్ కెన్నడీ అన్నారు.
లుట్నిక్‌పై ట్రంప్‌కు విశ్వాసం ఉందన్న వైట్ హౌస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ పక్క శక్తిమంతమైన బ్లాక్‌వెల్ చిప్స్ ఎట్టి పరిస్థితుల్లో చైనాకు చేరకూడదని చెబుతుండగా, వాణిజ్య శాఖ మాత్రం ఆ ఆదేశాలను తుంగలో తొక్కేలా వ్యవహరించిందని కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ రిలేషన్స్‌లో ఫెలో క్రిస్ మెక్‌గైర్ వెల్లడించారు. అయితే ఈ విషయంపై స్పందించిన వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు… ట్రంప్‌కు లుట్నిక్‌పై విశ్వాసం ఉందన్నారు. జెన్సన్ హువాంగ్‌కు, ట్రంప్ చివరి వరకూ అండగా నిలిచినట్లు తెలుస్తోంది. విమర్శలకు తలొగ్గి సీఈఓ పదవిని వదులుకోవద్దని ట్రంప్ ఆయనకు సూచించినట్లు సమాచారం. జెన్సన్ అద్భుతంగా పనిచేశారని కొనియాడిన ట్రంప్, ఆయన స్థానాన్ని భర్తీ చేయగల వ్యక్తి యాపిల్ మాజీ సీఈఓ టిమ్ కుక్ అని అభిప్రాయపడ్డారు. ఒక లెజెండ్ స్థానంలోకి మరో లెజెండ్ రావాలని ట్రంప్ ఆకాంక్షించారు.
జెన్సన్ హువాంగ్‌కు ఎన్వీడియా ఉద్యోగులు మద్దతు
మరోవైపు జెన్సన్ హువాంగ్‌కు ఎన్వీడియా ఉద్యోగులు మద్దతుగా నిలుస్తున్నారు. అంతర్గత సూచనల వేదికలో 1,600 మందికి పైగా ఉద్యోగులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, ఎక్కువ మంది ఆయనను తిరిగి సీఈఓగా నియమించాలని బోర్డును కోరుతున్నారు. రాజీనామా వెనుక ఉన్న పరిణామాలపై పారదర్శకత ఉండాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సీఈఓపై నిర్ణయం తీసుకునే ముందు ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, బోర్డు నిర్వహిస్తున్న విచారణ వివరాలను సిబ్బందికి తెలియజేయాలని కోరుతున్నారు. హువాంగ్ రాజీనామా అనంతరం కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈఓగా నియమించారు.
