ఏపీలో తీవ్ర వివాదాస్పదమవుతున్న పోస్టర్.. వేంకటేశ్వర స్వామి రూపంలో కడప ఎమ్మెల్యే భర్త
కడప డిప్యూటీ మేయర్ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ వేళ టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి ముఖాన్ని వేంకటేశ్వర స్వామి రూపంలో మార్ఫింగ్ చేసిన పోస్టర్ వివాదానికి దారితీసింది. బొమ్మిశెట్టి చంద్ర చేసిన ఈ పోస్ట్‌పై విపక్షాలు, భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్యామి అలసతి, సొలసితి. అంతట నీ శరనే జొచ్చితినీ…అంతర్యామి..అంటూ ఇప్పుడో పోస్టర్ ఏపీ వ్యాప్తంగా తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడీ పోస్టర్ తీవ్ర వివాదాస్పదమైంది. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి చిత్రానికి బదులుగా, స్వామివారి రూపంలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి ముఖాన్ని మార్ఫింగ్ చేసిన పోస్టర్‌ను బొమ్మిశెట్టి చంద్ర పోస్ట్ చేశారు. డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి స్వామీ…నిద్రలేకుండా, పరీక్షపెడుతున్నారే అంటూ బొమ్మిశెట్టి చంద్ర వేడుకుంటున్నట్టుగా ఉందా పోస్ట్.
ఈపోస్ట్‌పై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. వేంకటేశ్వర స్వామిని అవమానించారంటూ పోస్ట్‌ను వెంటనే తొలగించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలకు దిగాయి. ప్రస్తుతం కడప డిప్యూటీ మేయర్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కడప మేయర్ పదవిని టీడీపీ గెలుచుకుంది.డిప్యూటీ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కడప ఎమ్మెల్యే అనుచరుడు సుగవాసి పృథ్వీ పేరు బలంగా ప్రచారంలో ఉంది. కౌన్సిల్ సమావేశం నిర్వహించి అధికారికంగా డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై స్పష్టత వస్తుంది. ఈనేపధ్యంలో చంద్ర పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చతో పాటు రచ్చ కూడా చేస్తోంది. కడప ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునేందుకే చంద్ర ఈరకమైన పోస్ట్ పెట్టారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే హిందువుల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమను రాజకీయ ప్రయోజనాల కోసం మార్ఫింగ్ చేయడం ఏంటంటూ భక్తులు, విపక్షాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కడప కేంద్రంగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
