New Zealand Journalist: ఆధునిక కాలంలో మోడ్రన్ పేరుతో అన్ని రంగాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ముఖ్యంగా ధరించే దుస్తుల్లో అనేక మార్పులు వస్తున్నాయి. అలాగే కాలక్రమంలో మీడియాలోనూ మార్పులు వస్తున్నాయి. న్యూస్ ప్రెజెంట్ చేసే యాంకర్స్.. బుల్లి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. డిగ్నిటీని తెలియజేసేలా వస్త్రాలంకరణ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ న్యూస్ యాంకర్ టాటూ వేయించుకుని వార్తలు చదివింది. కైపారా న్యూజిలాండ్‌కు చెందిన ఒక న్యూస్ యాంకర్. ఈమె తొలిసారి ముఖంపై ఓ విచిత్రమైన టాటూతో వార్తలు చదివి నెట్టింట వైరల్‌గా మారారు. అయితే ఆమె తన ఫేస్‌పై వేయించుకున్నది స్టైల్ కోసం వేసుకున్న టాటూ కాదట. అది మారీ అనే తెగకు చెందిన సంప్రదాయ టాటూ అట.
న్యూజిలాండ్‌లో మారీ తెగ ప్రజలకు ప్రత్యేక నృత్య రీతులు, సంప్రదాయాలు, ఆచారాలు, పురాణాలు, భాష ఉన్నాయి. తమ నృత్యాన్ని ప్రదర్శిస్తూ వారు జీవనం సాగిస్తుంటారు. అలాంటి తెగ నుంచి వచ్చిన కైపారా… తమ వారిలో కాన్ఫిడెన్స్ పెంచేందుకు ఈ టాటూ వేయించుకున్నట్లు తెలిసింది. ప్రపంచంలో టాటూతో వార్తలు చదివిన తొలి న్యూస్ యాంకర్‌గా ఆమె నిలిచారు. మారీ తెగలోని మహిళలు ఈ టాటూ వేయించుకుంటారు. దీన్ని మోకో కాయి (moko kauae) అంటారు. 37 ఏళ్ల కైపారా… డిసెంబరు 27 సాయంత్రం 6 గంటల న్యూస్‌హబ్ లైవ్‌లో టాటూతో కనిపించారు. ఆ లైవ్‌లో ఆమెతోపాటూ… హోస్ట్‌లైన శ్యామ్ హాయెస్, మైక్ మెక్ రాబెర్ట్స్ కూడా పాల్గొన్నారు. బులిటెన్ తర్వాత ఈ నలుగురు పిల్లల తల్లి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇది తన జీవితకాల కల అని చెప్పారు. మారీ తెగల మహిళలు కూడా టాటూతో బులిటెన్ చదివే రోజు రావాలని తాను కోరుకున్నాననీ… ఇది తమ జాతి మహిళల్లో కాన్ఫిడెన్స్‌ను పెంచుతుందని ఆశిస్తున్నానని ఆమె వివరించారు.
దీనిపై నెటిజన్లు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. కొందరు ఆమెకు అనుకూలంగా స్పందిస్తుంటే… మరికొందరు… వ్యతిరేకిస్తున్నారు. సీరియస్ వార్త చదవాల్సి వచ్చినప్పుడు.. ఇలా టాటూతో చదివితే బాగోదు అని ఓ నెటిజన్ కామెంట్ ఇచ్చారు. “అందులో తప్పేముంది… తమ తెగ సంప్రదాయాన్ని ఆమె పాటిస్తున్నారు” అని మరో నెటిజన్ రిప్లై ఇచ్చారు.