కొత్త కరోనా వచ్చింది.. అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ మంత్రి జ్వెలీ కిజే తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కోవిడ్ రెండో వేవ్ ఈ కొత్త స్ట్రెయిన్ కారణమని తాము నమ్ముతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఈ కొత్త స్ట్రెయిన్‌పై ప్రభుత్వం అధ్యయనం జరుపుతోందన్నారు. అయితే ప్రజలు మాత్రం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగానే ఉంటూ భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.
‘501.వీ2’ అనే కొత్తరకం కరోనా స్ట్రెమిన్‌ను మేము గుర్తించాం.. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా రెండో వేవ్ వెనుకాల ఈ కొత్త రకం వైరస్ ఉందనేందుకు మాకు బలమైన ఆధారాలున్నాయి. అయితే ముందున్న వైరస్‌కంటే ఇది చాలా ప్రమాదకరమైనదా..? లేదా, లేకపోతే కోలుకున్న తర్వాత మళ్లీ సోకుతుందా ..? అనే దానికి సమాధానం చెప్పలేము అని ఆయన అన్నారు.
ఈ కొత్త వైరస్‌పై ల్యాబ్‌లో పరిశోధనలు
కాగా, ఈ కొత్త వైరస్ వ్యాప్తి వల్ల ల్యాబ్‌లో పరిశోధనలు కొనసాగుతున్నాయని శాస్త్రవేత్త కరీమ్ తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌కు కరీమ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ స్ట్రెయిన్‌ను ల్యాబ్‌లో పెంచుతున్నాం. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి సేకరించిన సీరమ్‌ను దీనిపై ప్రయోగించి వైరస్ నిర్వీర్యం అవుతుందో లేదో చూస్తాం. తర్వాత వచ్చే ఫలితాలను బట్టి ఈ కొత్త రకం వైరస్ మునుపటికంటే ప్రమాదకరమా..? కాదా అని తేలుస్తాం అని కరీమ్ అన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
అయితే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉంటూ మాస్కు ధరించడం, భౌతిక దూరం లాంటివి తప్పకుండా పాటించాలని సూచించారు. అప్పటికే కరోనా మహమ్మారి వల్ల ఎంతో నష్టం వాటిల్లిందని, ఈ వైరస్ కారణంగా రోజురోజుకు కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయని, అందుకే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి సూచించారు.