Myanmar Earthquake: భూప్రళయంతో నిమిషాల్లో అల్లకల్లోలం.. మయన్మార్‌లో వందలాది భవనాలు నేలమట్టం
- ఆకాశం విరిగి మీద పడితే..! భవనాలు గాల్లో ఊగితే..! రోడ్లపైన కార్లు షేక్ అయితే...! ఊహించుకోడానికే భయంగా ఉంది కదా..! మయన్మార్, థాయ్‌లాండ్ సహా పలు దేశాల్లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. భూకంపం అని తెలిసేలోపే అంతా అయిపోయింది. భూప్రళయం సృష్టించిన బీభత్సం ప్రపంచాన్నే వణికిస్తోంది.

క్షణాల్లో జీవితాలు తారుమారయ్యాయి. యముడిలా దూసుకొచ్చిన భూకంపం… మరణ మృదంగం సృష్టించింది. కళ్లముందే జరిగిన కల్లోలానికి ఎంతోమంది మృత్యువాడ పడ్డారు. ఓవైపు శిథిలాల కింద శవాల దిబ్బలు… మరోవైపు కాపాడండి అంటూ ఆర్తనాదాలు… మొత్తంగా మయన్మార్, థాయ్‌లాండ్‌లో ఎటూ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. మయన్మార్‌లో ఇప్పటివరకు 103 మృతదేహాలను వెలకితీశారు. ఇటు థాయ్‌లాండ్‌లోనూ పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.
మయన్మార్‌లో మృత్యుఘోష వినిపిస్తోంది. భూకంపానికి వందలాది భవనాలు కుప్పకూలడంతో… ఎటు చూసినా విషాదఛాయలే కనిపిస్తున్నాయి. ఓవైపు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆర్మీ బలగాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వందలాది మంది సైనికులు ప్రాణాలకు తెగించి శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీస్తున్నారు. తమ బంధువుల కోసం స్థానికులు సైతం శిథిలాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
మయన్మార్‌లో కొత్తగా నిర్మితమైన… ఇంకా పేరే పెట్టని ఆస్పత్రి పేకమేడలా కుప్పకూలింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు, చుట్టుపక్కల ఉన్న వందలాది మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. రెస్క్యూ పూర్తైతే… మృతుల సంఖ్య ఇక్కడి నుంచే ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
శిథిల్లాల్లో చిక్కుకుని కాపాడండి కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసిన దృశ్యాలు కూడా కనిపించాయి. మయన్మార్ క్యాపిటల్ సిటీ నేపిడాలో కూలిన హోటల్ భవనం శిథిలాల్లో చిక్కుకుని అల్లాడిపోయాడు ఓ వ్యక్తి. ఇనుక చువ్వుల మధ్య ఇరుక్కుపోయిన అతడ్ని… ఆర్మీ బలగాలు అతి కష్టం మీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
ఇటు థాయ్‌లాండ్‌లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో సుమారు వందమంది గలంతయ్యారు. రెస్క్యూ టీం ఇప్పటివరకూ ఏడుగురికి ప్రాణాలతో కాపాడింది. రెస్క్యూ పూర్తైతే మరణాలు పదుల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. ఇక భూకంపం ఎఫెక్ట్‌తో థాయ్ లాండ్ ప్రధానమంత్రి షినవత్ర ఎమర్జెన్సీ ప్రకటించారు.
మయన్మార్, థాయ్‌లాండ్ భూకంపాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రెండు దేశాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భూకంపం వల్ల జరిగిన విషాదం చూస్తుంటే… ఎంతో బాధగా ఉందన్నారు. అక్కడి వారందరూ క్షేమంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు మోదీ.