ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి: పాక్ సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు!
అడియాలా జైలులో బందీగా ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ (73) ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఆయనను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అడియాలా జైలులో బందీగా ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై గత కొద్ది రోజులుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఆయనను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2022లో అధికార పీఠం నుంచి దిగిపోయిన తర్వాత, ఇమ్రాన్ ఖాన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తనపై ఈ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. ఆగస్టు 2023 నుంచి జైలులోనే గడుపుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్య నివేదికలను పరిశీలించిన పిటిఐ (పాకిస్థాన్ తెహ్రీక్-యే-ఇన్సాఫ్) పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఇమ్రాన్‌కు తగిన వైద్యం అందించాలని తీవ్రంగా విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు నుంచి ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం లభించింది. 48 గంటల్లోగా ఇమ్రాన్ ఖాన్‌ను ‘షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్’కు తరలించి, సెప్టెంబర్ 16 వరకు అక్కడే ఉంచి వైద్యం అందించాలని కోర్టు స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్యాన్ని సమీక్షించేందుకు ఓ ప్రత్యేక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. అందులో ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడితో పాటు ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ కూడా సభ్యులుగా ఉంటారు.
వారానికి ఒకసారి కుటుంబ భేటీ
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రతివారం ఆయన కుటుంబ సభ్యులు ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతి లభించింది. అయితే, ఇమ్రాన్ ఖాన్ వైద్య నివేదికలను మీడియాకు బహిర్గతం చేయవద్దని, ఈ విషయాన్ని రాజకీయం చేయడానికి వీల్లేదని ఆయన న్యాయవాదులకు, కుటుంబ సభ్యులకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఇమ్రాన్ అభిమానులు, పిటిఐ శ్రేణులు హర్షం వ్యక్తం చేసారు.
కుడికంటి చూపు కోల్పోయారా?
73 ఏళ్ల క్రికెట్ లెజెండ్, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2022లో పీఠం కోల్పోయిన నాటి నుంచి అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 2023 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించిందని వార్తలు వస్తున్నాయి. జైలులో ఉన్న సమయంలో ఆయన కుడికంటి చూపు దాదాపు 85% కోల్పోయారని ఆయన తరఫు న్యాయవాదులు అంటున్నారు. గతేడాది నుంచి అతని కుమారులు కూడా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఇమ్రాన్‌పై తోషాఖానా, వివాహ చట్టాల ఉల్లంఘన వంటి అనేక కేసులున్నాయి. వీటిలో కొన్నింటిపై శిక్షలు నిలిపివేసినప్పటికీ మరికొన్ని విచారణలో ఉన్నాయి. జైలులో ఇమ్రాన్‌కు మెరుగైన వైద్యం అందించాలని భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు కూడా పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో పార్టీ గుర్తును తొలగించినప్పటికీ, పాకిస్థాన్‌లో పిటిఐ పార్టీకి ఇప్పటికీ విశేష ప్రజాదరణ ఉంది.