Donald Trump: ట్రంప్‌పై పెరుగుతున్న వ్యతిరేకత..! రోడ్లపైకి లక్షలాది నిరసనకారులు.. కాల్పుల్లో ఒకరు మృతి!
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు రోడ్లకు దిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వలసదారుల హక్కులను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యూయార్క్, లాస్ ఏంజిలిస్ వంటి పెద్ద నగరాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ నిరసనలు జరుగుతున్నాయి.

అమెరికా రోడ్లు నిరసన కారులతో నిండిపోయాయి. కొన్ని లక్షల మంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ట్రంప్ అక్రమ వలసదారుల అరెస్టులకు ఆదేశించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, వలసదారుల హక్కులను కాపాడండి అనే నినాదాలతో అమెరికా వీధులు, పార్కులు, ప్లాజాలు హోరెత్తాయి. పలు నగరాల్లో భారీ ప్రదర్శనలు జరగ్గా పోర్ట్‌ల్యాండ్‌లో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
సాల్ట్‌లేక్ సిటీలో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారు. న్యూయార్క్, డెన్వర్, షికాగో, ఆస్టిన్, లాస్‌ఏంజిలిస్‌లలో ట్రంప్ వ్యతిరేకులు కవాతు నిర్వహించారు. డ్రమ్స్ వాయిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు ‘నో కింగ్స్’ బ్యానర్లు ప్రదర్శించారు. డౌన్‌టౌన్‌లు, చిన్న పట్టణాలు నిరసన ప్రదర్శనలతో కిక్కిరిసిపోయాయి. వందలాది నిరసన కార్యక్రమాల్లో లక్షల మంది అమెరికన్లు పాల్గొని ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు ట్రంప్ .. వాషింగ్టన్‌లోని సైనిక పరేడ్‌కు హాజరయ్యారు. ఒకవైపు ఆందోళనలు, మరోవైపు సైనికుల కవాతుతో వాషింగ్టన్ హోరెత్తింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
