ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ వార్తలు చదువుతుండగా.. ఏకంగా టీవీ స్టూడియోపైనే..! భయంకర దృశ్యం
ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో ఇరాన్ టీవీ స్టూడియో లక్ష్యంగా మారింది. లైవ్ న్యూస్ బులెటిన్ సమయంలో ఈ దాడి జరిగింది. యాంకర్ వార్తలు చదువుతుండగానే దాడి జరిగి, ఆమె స్టూడియో నుండి పారిపోయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇజ్రాయెల్ ఇరాన్‌లోని అనేక సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసిందని, ముందే హెచ్చరికలు జారీ చేసిందని తెలిసింది.

ఓ లేడీ యాంకర్ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన వార్తలు చదువుతోంది. సడెన్‌గా ఆ టీవీ స్టూడియో బిల్డింగ్‌పైనే ఇజ్రాయెల్ దాడి చేసింది. వార్తల మధ్యలోనే భారీ శద్ధంతో ఆ స్టూడియో కంపించిపోయింది. పక్కనుంచి పొగ అలుముకుంది. దాంతో ఆ యాంకర్ వార్తలు ఆపేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ భయంకర దృశ్యాలన్నీ ఆ లైవ్ టీవీ బులిటెన్‌లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఇరాన్‌లోని ప్రభుత్వ టీవీ స్టూడియోలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడింది. ఆ దాడి దృశ్యాలే ప్రత్యేక్షంగా ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి.
కాగా ఇజ్రాయెల్ జరిపిన ఈ వైమానిక దాడిలో ఇరానియన్ రేడియో, టీవీ ఉద్యోగులు చాలా మంది మరణించారు. ఇరానియన్ మీడియా ప్రకారం.. ప్రసారం సమయంలో ఇరానియన్ స్టేట్ టెలివిజన్ రిపోర్టర్ వార్తలు చదువుతుండగా ఈ దాడి జరిగినట్లు పేర్కొన్నారు. అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించడంతో యాంకర్ కెమెరా ముందు నుంచి లేచివెళ్లిపోయింది. దీంతో లైవ్ అక్కడితో ఆపేశారు.
ముందే హెచ్చరించి మరీ..
అయితే టీవీ స్టూడియోలు ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ రాజధానిలో టీవీ స్టూడియోలు ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఒక గంట ముందు హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ రాజధాని గగనతలంపై ఆధిపత్యాన్ని సాధించిందని పేర్కొంది. గతంలో దాడులకు ముందు గాజా, లెబనాన్‌లోని కొన్ని ప్రాంతాలలోని పౌరులకు సైన్యం ఇలాంటి హెచ్చరికలను జారీ చేసింది. “ఈ సమయంలో మేం టెహ్రాన్(ఇరాన్ రాజధాని) ఆకాశంపై పూర్తి వైమానిక ఆధిపత్యాన్ని సాధించామని చెప్పగలం” అని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ అన్నారు.
మధ్య ఇరాన్‌లో 120కి పైగా ఉపరితలం నుండి ఉపరితలం వరకు క్షిపణి లాంచర్‌లను తాం ధ్వంసం చేశామని, ఇది ఇరాన్ మొత్తం మీద మూడో వంతు అని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్ వెలుపల సైనిక, నిఘా కార్యకలాపాలను నిర్వహించే రివల్యూషనరీ గార్డ్ ఎలైట్ విభాగం అయిన ఇరాన్ కుడ్స్ ఫోర్స్‌కు చెందిన టెహ్రాన్‌లోని 10 కమాండ్ సెంటర్‌లను ఫైటర్ జెట్‌లు ధ్వంసం చేశాయని కూడా పేర్కొంది. అదే సమయంలో ఇరాన్ దాదాపు 100 క్షిపణులను ప్రయోగించిందని, శుక్రవారం నుండి దేశంలో కనీసం 224 మందిని బలిగొన్న తన సైనిక, అణు మౌలిక సదుపాయాలపై విస్తృత దాడులకు మరింత ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. ఇరాన్ 370కి పైగా క్షిపణులు, వందలాది డ్రోన్‌లను ప్రయోగించడంతో ఇప్పటివరకు 24 మంది మరణించారని, 500 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ తెలిపింది.
వివాదం ఎందుకు మొదలైంది?
ఇరాన్‌లోని అగ్ర సైనిక నాయకులు, యురేనియం శుద్ధి కేంద్రాలు, అణు శాస్త్రవేత్తలపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో తాజా వివాదం ప్రారంభమైంది. ఇరాన్ తన దీర్ఘకాల ప్రత్యర్థి అణ్వాయుధాన్ని నిర్మించడానికి దగ్గరగా రాకుండా నిరోధించడానికి ఇది అవసరమని పేర్కొంది. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుతంగా ఉందని, 2003 నుండి టెహ్రాన్ అణ్వాయుధాన్ని అనుసరించడం లేదని అమెరికా, ఇతరులు అంచనా వేశారు. కానీ ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందని, అది తమకు ముప్పు అని ఇజ్రాయెల్ వాదిస్తోంది.
This is so shocking!
Attack during a live TV show. However, this anchor returned to do a program again some time after the attack. Journalism 🫡 pic.twitter.com/KxuvOTOwqr
— Arpit Sharma (@iArpitSpeaks) June 16, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
