మూఢభక్తి 47 మందిని బలితీసుకుంది. ఓ మత పెద్ద సూచనతో దైవాన్ని కలవాలడానికి కఠిన ఉపవాసం చేసి ప్రాణాలు తీసుకున్నారువారంతా. ఆఫ్రికాలోని కెన్యాలో ఈ భయంకరమైన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కెన్యాలోని కిల్ఫీ ప్రావిన్స్‌లోని షాకహోలా అటవీ ప్రాంతంలో పోలీసులు మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఆదివారం మరో 26 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గుడ్‌న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్‌కి చెందిన పాస్టర్ మాకెంజీ ఎన్‌థాంగే తనను అనుసరిస్తున్న వారిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జీసస్‌ను కలుసుకోవాలనుకుంటున్నవారు ఉపవాసం ఉండి ఆకలితో అలమటించి మరణించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకలితో అలమటించి చనిపోయిన వారిని పాతిపెడితే అప్పుడు వారంతా పరలోకానికి వెళ్తారని నమ్మబలికాడు. దీంతో పాస్టర్ మాటలకు ప్రేరేపితులైన అమాయక ప్రజలు ఆకలితో ప్రాణాలు తీసుకున్నారు. ఈ నెల 11న 11 మంది మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. పాస్టర్‌పై అనుమానంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది.
మరో 11 మంది ఉపవాసం ఉండగా, పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స నందించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత వారం రోజుల నుంచి పోలీసులు ఆ ప్రాంతంలో మృతదేహాలను వెలికితీసేందుకు తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో నిన్న 26 మృతదేహాలు లభ్యమవడంతో మృతుల సంఖ్య 47కి చేరింది. మరణించిన వారిని తెల్లని ప్లాస్టిక్ షీట్‌లో చుట్టి మట్టిలో పూడ్చిపెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు గుర్తించారు. కేవలం మృతదేహాల కోసం మాత్రమే కాకుండా ఈ దారుణ ఘటనలో ఉపవాసంతో ప్రాణాలు తీసుకుంటున్న వారి కోసం కూడా అన్వేషిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
మరోవైపు తాను ఆత్మహత్యకు ప్రేరేపించలేదని, 2019లోనే చర్చిని మూసివేసినట్లు పాస్టర్ చెప్పడం విశేషం. దీంతో మరణించిన వారంతా ఆకలితోనే మృతి చెందారని నిరూపించేందుకు మృతుల డీఎన్‌ఏ నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. కాగా మలిండి సమీపంలోని షాకహోలా వద్ద 800 ఎకరాల (325-హెక్టార్లు) అటవీ ప్రాంతంలో ఈ దారుణ ఘనట చోటుచేసుకుంది. ఉపవాసంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో కొందరు అడవిలో దాక్కున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పాస్టర్ గతంలో కూడా ఇద్దరు చిన్నారుల మృతికి కారణమైనట్లు తెలుస్తోంది. మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పట్లో జరిమానా చెల్లించి, కేసు నుంచి బయపటడ్డాడు. ప్రజలను తప్పుదోవపట్టించే ఇటువంటి చర్చిలు, మసీదులు, దేవాలయాలపై కఠిన పర్యావేక్షణ ఉండాలంటూ ఆ దేశ ఇంటీరియల్ మినిస్టర్ కిండికి ట్వీట్ చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.