AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. గల్ఫ్ వార్‌కు బ్రేక్.. చర్చల మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చిన పాక్!

ప్రపంచమా ఊపిరి పీల్చుకో. వార్‌కు బ్రేక్ పడింది. చర్చలు సఫలం దిశగా వెళ్తున్నట్లు సంకేతాలొచ్చాయి . ఇందులో ఎవరు గెలవలేదు. ఓడలేదు. కానీ మూల్యం ప్రపంచం చెల్లించుకుంది. పైగా ఇరాన్‌పై ఇప్పుడు అమెరికా వైఖరే మారిపోయింది. మొన్నటి దాకా కయ్యానికి కాలు దువ్విన అగ్రరాజ్యం ఇప్పుడు వియ్యానికి చేతులు కలుపుతోంది. న్యూక్లియర్ బాంబ్స్ లేవు. మట్టిగడ్డాలేదు.. అంటూ ఇరాన్‌కు ఎన్‌వోసీ కూడా ఇస్తోంది. ఇంతకూ 24రోజుల్లో అమెరికా స్టాండ్ మారడానికి కారణం ఏంటి..? సరైన దిశ లేకుండా యుద్ధం బరిలోకి దిగితే ఫలితాలు తిప్పికొడతాయని ట్రంప్ గ్రహించాడా..?

ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. గల్ఫ్ వార్‌కు బ్రేక్.. చర్చల మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చిన పాక్!
Donald Trump, Mojtaba Khamenei, Shehbaz Sharif
Balaraju Goud
|

Updated on: Mar 24, 2026 | 7:59 AM

Share

పశ్చిమాసియా యుద్ధంలో ఎవరు గెలవలేదు.. ఓడలేదు.. కానీ భారీ మూల్యం చెల్లించింది ప్రపంచం. క్రూడాయిల్ ధరలు 85 నుంచి 110 డాలర్లు దాటింది. LNG మార్కెట్ డిస్టర్బ్ అయింది. స్టాక్స్ కుదేలయ్యాయి. యుద్ధం మూడు దేశాల మధ్యే అయినా.. దాని నష్టం గ్లోబల్ ఎకానమీ చెల్లించుకుంది. అయితే ఇంత త్వరగా ఇరాన్‌పై అమెరికా స్టాండ్ మారుతుందని ఎవరూ ఊహించలేదు. యుద్ధం ఏదో మూణ్ణాళ్ల ముచ్చటగా భావించినా, ఇరాన్ నుంచి వచ్చిన రియాక్షన్‌తో టోటల్ మార్కెట్ షేక్ అయింది. యుద్ధం మొదలైన వెంటనే మార్కెట్ రియాక్షన్ అమెరికాను కుదిపేసింది. బ్రెంట్ క్రూడాయిల్ 110 డాలర్ల దగ్గరికి వెళ్లింది. కొన్ని సెషన్స్‌లో 114 డాలర్లు టచ్ అయింది. మార్కెట్‌లో ప్రెషర్ పెరిగింది. స్టాక్స్ పడిపోయాయి. డాలర్ స్ట్రాంగ్ అయినా అది కూడా బలహీనపడే సూచనలు కనిపించాయి. మార్కెట్ అస్థిరంగా ఉండటం అమెరికాకే పెద్ద రిస్క్. అందుకే అమెరికానే యుద్ధానికి బ్రేక్‌ ఇచ్చిందన్న విశ్లేషణలు వస్తున్నాయి.

ట్రంప్ వార్‌కు బ్రేక్ ప్రకటించిన వెంటనే నిఫ్టీ వెయ్యిపాయింట్లు జంప్ అయింది. యూరోపియన్ మార్కెట్లు 2.5% నష్టాల నుంచి 1 – 1.5% రికవర్ అయ్యాయి. కూడాయిల్ ధరలు 10 డాలర్లు తగ్గాయి. అంటే ప్రపంచ మార్కెట్లు శాంతిని కోరుకుంటున్నాయి. మరోవైపు ఎయిర్ స్ట్రైక్స్, మిస్సైల్ అటాక్స్‌తో ఇరాన్‌ను పూర్తిగా అణచలేమని అమెరికా గ్రహించింది. ఇరాన్ మిలిటరీ స్ట్రక్చర్ డిస్ట్రిబ్యూటెడ్‌గా ఉంది. నాయకులను టార్గెట్ చేసినా అక్కడి సిస్టమ్‌ను బ్రేక్ చేయలేకపోయింది. మూడు వారాల పాటు నిరంతరం డ్రోన్, మిస్సైల్ దాడులతో ఇరాన్ విరుచుకుపడడమే ఇందుకు ప్రూఫ్. ఇక మరో కీలకపాయింట్ హార్ముజ్ జలసంధి క్లోజ్ కావడం. ఒకవేళ యుద్ధం కొనసాగితే తర్వాతి స్టెప్ ఏమిటి? గ్రౌండ్ ఆపరేషన్? ఖార్గ్ ఐలాండ్ స్వాధీనం? ఇస్ఫహాన్ అణు నిల్వలపై దాడి? ఇవన్నీ హై రిస్క్ ఆప్షన్స్. ప్రాణ నష్టం, అంతర్జాతీయ వ్యతిరేకత, దీర్ఘకాలిక యుద్ధం.. ఇదంత సాధ్యమయ్యే పనికాదు. అందుకే అమెరికా వెనక్కి తగ్గినట్లు నిపుణులు భావిస్తున్నారు.

పైగా అమెరికా అధ్యక్షుడు తొలిసారి ఇరాన్‌ పట్ల పాజిటివ్‌ గా మాట్లాడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. పైగా ఏ సాకుతో అయితే ఇరాన్‌పై యుద్ధం ప్రకటించాడో.. ఇప్పుడా సాకుపై వెనక్కి తగ్గాడు. ఇరాన్‌లో న్యూక్లియర్ వెపన్స్ లేవని ట్రంప్ డిక్లేర్ చేశాడు. అలాగే ఇరాన్ భవిష్యత్‌లో సూపర్ కంట్రీగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. దశాబ్దాల పాటు ఇరాన్‌పై పీకలదాకా కోపం పెంచుకున్న అమెరికా.. ఇంత తక్కువ టైమ్‌లో తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకుందన్న చర్చ కూడా జరుగుతోంది.

ప్రస్తుతం వార్‌కు తాత్కాలిక బ్రేక్ మాత్రమే. చర్చలు కీలక దశలో ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ట్రంప్ అల్లుడు కుష్నర్‌తో పాటు మరో అమెరికా అధికారి ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నారు. ఇవి మరో ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉంది. అయితే చర్చలపై ఇరాన్ మాత్రం అధికారికంగా పూర్తిగా అంగీకరించలేదు.

ఇదిలావుంటే, రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, అమెరికా-ఇరాన్ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నాలు పాకిస్తాన్ వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ వారంలోనే ఇస్లామాబాద్‌లో సమావేశం జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. ఇరాన్‌తో ఫలవంతమైన చర్చల అనంతరం, ఆ దేశ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈనేపథ్యంలోనే అమెరికా – ఇరాన్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రముఖులతో ఇస్లామాబాద్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సంప్రదింపులు జరుగుతున్నాయి అని ఒక సీనియర్ ఇజ్రాయెల్ అధికారి తెలిపారు.

మొత్తంగా చూస్తే, ఈ 24 రోజుల యుద్ధం ఒక పెద్ద పాఠం నేర్పింది. స్పష్టమైన లక్ష్యం లేకుండా యుద్ధం ప్రారంభిస్తే.. బయటపడటం కష్టం. అమెరికా టాక్టికల్‌గా ముందుంది. కానీ స్ట్రాటజిక్‌గా క్లియర్ విక్టరీ సాధించలేదంటున్నారు నిపుణులు. ఇరాన్ మిలిటరీగా బలహీనపడింది. కానీ రాజకీయంగా మాత్రం నిలబడింది. ఇది రెండు యుద్ధాల కథ.. ఒకటి గన్స్‌తో.. మరొకటి ఎకానమీతో.. ఎవరు పూర్తిగా గెలవరు. కానీ ఎవరు ఎక్కువ కాలం నిలబడతారో వారిదే విజయమని నిరూపించింది..!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us