Iran Blast: సులేమానీ సంస్మరణ కార్యక్రమంలో జంట పేలుళ్లు.. 103 మంది దుర్మరణం.. 200 మందికి పైగా..

ఇరాన్‌ లో జరిగిన జంట పేలుళ్లలో 95 మంది మరణించారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 2020లో అమెరికా డ్రోన్‌ దాడిలో మరణించిన సైనికాధికారి ఖాసీం సులేమానీ సంస్మరణ కార్యక్రమంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

Iran Blast: సులేమానీ సంస్మరణ కార్యక్రమంలో జంట పేలుళ్లు.. 103 మంది దుర్మరణం.. 200 మందికి పైగా..
Iran Blast
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 04, 2024 | 9:03 AM

ఇరాన్‌ లో జరిగిన జంట పేలుళ్లలో 103 మంది మరణించారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 2020లో అమెరికా డ్రోన్‌ దాడిలో మరణించిన సైనికాధికారి ఖాసీం సులేమానీ సంస్మరణ కార్యక్రమంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇరాన్‌లోని ఆగ్నేయ నగరమైన కెర్మాన్‌లో బుధవారం జరిగిన సంస్మరణ కార్యక్రమంలో జంట పేలుళ్లు సంభవించడంతో .. దేశంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఖాసేమ్ సులేమాని జ్ఞాపకార్థంగా నిర్వహించిన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఆయన సమాధి సమీపంలో పేలుళ్లు సంభవించాయి. మొదటి పేలుడు జరిగిన దాదాపు 20 నిమిషాల తర్వాత రెండవ పేలుడు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. పేలుళ్లకు బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు. అయితే, పేలుడుకు ఇరాన్ అధికారులు గుర్తుతెలియని ఉగ్రవాదులే కారణమని ఆరోపించారు. అంతేకాకుండా.. ఈ పేలుళ్లలో అమెరికా హస్తం ఉందని ఇరాన్‌ అధికార వర్గాలు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది.

అయితే, ఇరాన్‌లో రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసిం సులేమానీ సమాధి దగ్గర జరిగిన పేలుళ్లలో అమెరికా హస్తం ఉందనే వార్తలను అగ్రరాజ్యం ఖండించింది. ఈ పేలుళ్లతో తమకు, ఇజ్రాయెల్‌కు ఎలాంటి సంబంధం లేదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. ఈ చర్య తమ దేశానికి ఏ విధంగానూ లాభం కాదన్నారు. ఆరోపణలు చేసేప్పుడు ఆచితూచి వ్యవహరించాలని హితవు పలికారు. ఈ పేలుళ్లు గతంలో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు జరిపిన తరహా ‘ఉగ్రదాడి’గా కనిపిస్తున్నాయని అమెరికాలోని సీనియర్ బిడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారి తెలిపారు.

ఈ దాడిని ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ తీవ్రంగా ఖండించారు. ఇది హేయమైన, అమానవీయ ఘటన అంటూ పేర్కొన్నారు. ఈ పిరికిపంద చర్యకు సంబంధించిన వారిని త్వరలో గుర్తించి కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ సంఘటన 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకున్న అత్యంత ఘోరమైన దాడిగా ఇరాన్ అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..