Dubai visa: భారతీయుల వీసాలను రిజెక్ట్ చేస్తోన్న UAE.. రీజన్స్ ఇవే..
మీరు దుబాయ్ వెళ్లాలనుకుంటున్నారా? టూరిస్ట్ వీసా కోసం ట్రై చేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. ఇక మీదట గతంలో మాదిరి అలా దుబాయ్ వెళ్లి ఇలా వచ్చేయడం కుదరదు. ఎందుకంటే వీసా నిబంధనలను కఠినతరం చేసింది UAE. భారతీయుల వీసాలను భారీగా రిజెక్ట్ చేస్తోంది. ఇంతకీ వీసాల తిరస్కరణకు కారణమేంటి?

గతంలో భారతీయుల నుంచి వీసా అప్లికేషన్లు రాగానే ఆమోదం లభించేది. ఏవైనా పొరపాట్లు ఉంటే వందలో ఒక్క అప్లికేషన్ రిజెక్ట్ చేసేవారు అధికారులు. కానీ ఇప్పుడు వందమంది దరఖాస్తు చేసుకుంటే 10 అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు. అన్ని సవ్యంగా ఉన్నా వీసాలు ఆమోదించడం లేదు దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు. భారతీయుల వీసా తిరస్కరణ రేటు గతంతో పోలిస్తే ఆల్‌టైమ్ హై .. కి చేరిందని నివేదికలు చెబుతున్నాయి.
వీసా నిబంధనలను కఠినతరం చేసింది UAE. వీసా దరఖాస్తులతో పాటు ఏ హోటల్‌లో బస చేస్తారో.. ఆ హోటల్ బుకింగ్ డాక్యుమెంట్స్ వాటి క్యూఆర్ కోడ్‌లు, విమాన రిటర్న్ టికెట్లు జత చేయాలని నిబంధనలు విధించింది. ఒకవేళ హోటల్ కాకుండా బంధువుల ఇంట్లో ఉండాలనుకునేవారు రిలేటివ్స్ నివాస ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. హోస్ట్ రెంటల్ ఒప్పందం, ఎమిరేట్స్ ఐడీ, కాంటాక్ట్ వివరాలు తప్పనిసరి చేసింది గతంలో రెసిడెన్షియల్ ప్రూఫ్స్ అడిగేవారు కాదు. ఒకవేళ అడిగినా ఎయిర్ పోర్ట్ అధికారులు మాత్రమే అడిగేవారు. కానీ ఇప్పుడు ఈ పత్రాలు ముందుగా జత చేస్తేనే వీసాకు ఆమోదం లభిస్తుంది
గతంలో మాదిరి 50 వేల రూపాయలతో దుబాయ్ వెళ్లి రెండు నెలలు ఉంటామంటే కుదరదు. మారిన నిబంధనల ప్రకారం రెండు నెలలు వీసా పొందాలనుకునేవారు వారి అకౌంట్‌లో 5 వేల దిర్హమ్‌లు అంటే మన కరెన్సీ ప్రకారం లక్షా 14 వేలు ఉండాలని నిబంధనలు పెట్టింది యూఏఈ ప్రభుత్వం.
వీసా తిరస్కరణ వల్ల దరఖాస్తుదారులు నష్టపోవాల్సి వస్తుంది. వీసా రిజెక్ట్ అయితే అందుకోసం చెల్లించిన డబ్బు రిటర్న్ రాదు. విమాన టికెట్లు, హోటల్ బుకింగ్ కోసం చెల్లించిన డబ్బును కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఈనెల 6 నుంచి జనవరి 12 వరకు దుబాయ్‌లో షాపింగ్ ఫెస్టివల్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా దుబాయ్‌కి పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. దీంతో పర్యాటకుల సంఖ్యను తగ్గించేందుకే UAE వీసా నిబంధనలను కఠినతరం చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
