మహిళ ప్రాణం తీసిన నేపాల్‌ టూర్.. అక్కడి నుంచి తప్పించుకునే టైమ్‌లో ఏం జరిగిందంటే..?

నేపాల్‌లో ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటుంది. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన హింసలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అటు భారతీయులు సైతం ఈ నిరసనలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏకంగా ఓ మహిళ ప్రాణాలే కోల్పోయింది. ఆమె ఎలా చనిపోయిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మహిళ ప్రాణం తీసిన నేపాల్‌ టూర్.. అక్కడి నుంచి తప్పించుకునే టైమ్‌లో ఏం జరిగిందంటే..?
Indian Woman Dies In Nepal

Updated on: Sep 12, 2025 | 9:07 PM

నేపాల్‌లో చెలరేగిన హింసాత్మక నిరసనల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నిరసనల్లో కనీసం 51 మంది మరణించగా, 1,300 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం జరిగిన పోలీసుల కాల్పుల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నిరసనకారులు పార్లమెంటును, పలువురు మంత్రుల ఇళ్లను కూడా తగలబెట్టారు. ఈ తీవ్ర నిరసనల కారణంగా ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది. నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

ఈ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం కారణంగా ఘజియాబాద్‌కు చెందిన 57 ఏళ్ల మహిళ రాజేష్ గోలా మరణించారు. ఆమె తన భర్తతో కలిసి ఖాట్మండులోని హయత్ రీజెన్సీ హోటల్‌లో బస చేశారు. సెప్టెంబర్ 9న ‘జనరేషన్ జెడ్’ నిరసనకారులు రాజేష్ గోలా బస చేసిన హోటల్‌కు నిప్పంటించారు. మంటలు దట్టంగా వ్యాపించడంతో ఆమె తప్పించుకునే దారులు మూసుకుపోయాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది కింద పరుపులు వేసి కిటికీ నుంచి దూకమని సూచించారు.

రాజేష్ గోలా, ఆమె భర్త రాంవీర్ సింగ్ గోలా నాల్గవ అంతస్తు నుండి దూకారు. రాంవీర్ సింగ్‌కు స్వల్ప గాయాలవగా, రాజేష్ గోలాకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. ఈ ఘటనలో తన తల్లి మరణించడం పట్ల ఆమె కుమారుడు విశాల్ బోరున విలపించాడు. ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో తన తల్లిదండ్రులు విడిపోయారని.. తన తల్లి తండ్రి వద్దే ఉంటే ప్రాణాలతో ఉండేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.