ఫ్లోరిడాలో గతవారం బిల్డింగ్ కూలిన ఘటనలో 150 మంది గల్లంతు కాగా వారిలో ఓ ఇండో-అమెరికన్ కుటుంబం కూడా ఉంది. ఈ దుర్ఘటనలో విశాల్ పటేల్, ఆయన భార్య భావనా పటేల్, వారి ఏడాది వయసున్న కూతురు కనిపించడం లేదని వారి బంధువులు తెలిపారు. ఇప్పటివరకు వీరి ఆచూకీ తెలియడంలేదని విశాల్ పటేల్ మేనకోడలు సరీనా పటేల్ తెలిపింది. భావనా పటేల్ నాలుగు నెలల గర్భవతి అని కూడా ఆమె చెప్పింది. భవనం కూలినప్పుడు వారు అక్కడే ఉన్నారని.. వారిని కాంటాక్ట్ చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆమె వాపోయింది. కాగా శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక బృందాలు ఇంకా యత్నిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 9 మంది మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. మరో ఘటనలో మియామీ బీచ్ సమీపంలోని భవనం ఈ నెల 24 న కూలిపోయింది. ఆ ఘటనలో ఐదుగురు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. అటు-ఫ్లోరిడా లోని భవనంలో అర్జెంటీనా, పరాగ్వే, కొలంబియా, దేశాలకు చెందిన కుటుంబాలు, యూదులు కూడా నివసిస్తున్నారు.వివిధ దేశాలకు చెందినవారైనప్పటికీ వీరంతా ఒకే కుటుంబంలా ఐకమత్యంగా ఉండేవారని స్థానికులు తెలిపారు.
ఏదైనా అద్భుతం జరిగి కనీసం శిథిలాల నుంచి తమవారు బతికి బయట పడతారా అని వీరి బంధువులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫ్లోరిడా గవర్నర్ ఈ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించారు. మరికొన్ని రోజులైనా సహాయక చార్యులలు కొనసాగుతాయని భావిస్తున్నారు. అసలు ఈ పెను ప్రమాదం జరగడానికి కారణాలు ఇప్పటికీ కచ్చితంగా తెలియడంలేదు.