భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో..! పాకిస్తాన్‌లో భయం భయం.. రేషన్ సిద్ధం చేసుకోవాలంటూ అక్కడి ప్రజలకు ఆదేశాలు
పహల్గామ్ కుట్రకు ఫలితం అనుభవిస్తామన్న భయం పాకిస్తాన్‌ను వెంటాడుతోంది. అందుకే POK ప్రజలు రెండు నెలల ఆహార నిల్వలను , మందులను సిద్దం చేసుకోవాలని సూచించారు. బంకర్లను రెడీ చేస్తున్నారు. యుద్ద భయంతో సామాన్య పౌరులకు కూడా ఆయుధ శిక్షణ ఇస్తోంది పాకిస్తాన్ సైన్యం..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందోనని.. పాక్ ఆర్మీ భయాందోళనతో వణికిపోతోంది.. ఈ క్రమంలోనే LOC దగ్గర పాక్ బలగాలు పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. కుప్వారా , బారాముల్లా, పూంచ్, అక్నూర్.. నౌషేరా సెక్టార్లలో పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. భారత సైన్యం ఎప్పటికప్పుడు పాక్ దాడులను తిప్పికొడుతోంది. భారత్‌తో యుద్ద భయంతో గిల్గిట్ బాలిస్తాన్ ప్రాంతంలో భారీగా బలగాను మోహరించింది పాకిస్తాన్. పర్వత ప్రాంతాలకు బలగాలను తరలించారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో.. భారత్ దాడి చేస్తుందన్న భయం
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్ దాడి చేస్తుందన్న భయంతో పౌరులకు సైనిక శిక్షణ ఇస్తున్నారు. పీవోకేలో బంకర్లు శుభ్రం చేస్తున్నారు. భారత్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని స్థానికులు రెండు నెలలకు సరిపడ నిత్యావసర వస్తువులు , మందులు సిద్దం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. యుద్దానికి సిద్దంగా ఉండాలని పౌరులకు తెలిపారు. అంతేకాకుండా పీవోకేలో రిజర్వ్ బలగాలను కూడా రంగం లోకి దింపింది పాకిస్తాన్.
ఉగ్రవాద శిక్షణా శిబిరాలకు నిలయంగా ఉన్న మదరాసాలను భారత సైన్యం టార్గెట్ చేస్తుందన్న అనుమానంతో పాకిస్తాన్ మూసేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 1000 మదరాసాలను 10 రోజుల పాటు మూసేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు తమ బంకర్లను శుభ్రం చేసుకుంటున్నారు. పీవోకేలో పిల్లలకు కూడా పాకిస్తాన్ సైన్యం ఆయుధ శిక్షణ ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. తమ దేశం ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న మాట నిజమేనని ఒప్పుకున్నారు
నీలం వ్యాలీ మూత ..
పాకిస్తాన్‌లో నీలం వ్యాలీ అంటే టూరిస్టుల స్వర్గధామం అని పేరు. కాని పహల్గామ్ దాడి తరువాత నీలం వ్యాలీ మూత పడింది. టూరిస్టులు రాక నీలం వ్యాలీ వెలవెలబోయింది. దాదాపు 3 లక్షల మంది నీలం వ్యాలీని ప్రతి ఏటా సందర్శిస్తారు. కాని ఈ ప్రాంతంలో హోటళ్లు ఖాళీ అయ్యాయి. పాక్ టాప్ టూరిస్ట్ ప్లేస్ ఇలా వెలవెలబోతోంది.
భారత్ దాడి భయంతో బంకర్‌లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ బయటకు వచ్చారు. ఎల్‌వోసీ దగ్గర పాకిస్తాన్ బలగాలతో మాట్లాడారు. యుద్ద ట్యాంక్‌పై ఎక్కి పాక్ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ ఎలాంటి దాడి చేసినా తిప్పికొడతామని ప్రకటించారు. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌తో పాటు ఇతర సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై భారత్ బ్యాన్ విధించింది.
భారత్ కన్నెర్ర..
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ కన్నెర్ర చేస్తోంది. పాక్‌ను అన్ని విధాలా దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యహప్రతివ్యూహాలు అమలు చేస్తోంది. పహల్గామ్ కుట్రకు ఫలితం అనుభవించాల్సిందేనని.. ఇప్పటికే భారత్ స్పష్టంచేసింది.. ప్రతీకారం ఊహించని విధంగా ఉంటుందని స్పష్టంచేసింది.
అయితే భారత్ కూడా పాక్ ప్లాన్స్‌ను నిశితంగా పరిశీలిస్తోంది. దీనికోసం ఇప్పటికే బోర్డర్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేయడమే కాకుండా.. నిఘా వర్గాలను అలర్ట్‌గా ఉంచింది. పాకిస్తాన్ అణుకేంద్రాల దగ్గర ఏం జరుగుతోందో ప్రతీ క్షణం తెలుసుకుంటోంది భారత్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
