AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ గల్లంతు.. అమ్మ కోసం కొడుకు ఎదురుచూపులు!

నేపాల్ వరదల్లో హైదరాబాద్‌కు చెందిన 44 ఏళ్ల సుహాసిని రెడ్డి గల్లంతయ్యారు. కైలాష్ మానస సరోవర్ యాత్రలో భాగంగా నేపాల్ వెళ్లిన ఆమె ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పుట్టినరోజున తల్లి వస్తుందని చిన్న కుమారుడు సమయ్ ఎదురుచూస్తున్నాడు. తెలంగాణ నుంచి 23 మంది పర్యాటకులు కూడా నేపాల్‌లో చిక్కుకుపోగా, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేసింది.

నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ గల్లంతు.. అమ్మ కోసం కొడుకు ఎదురుచూపులు!
Kandimalla Suhasini Reddy
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Aug 28, 2026 | 1:08 PM

Share

హైదరాబాద్: నేపాల్‌లో సంభవించిన భీకర వరదలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు పర్యాటకుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన 44 ఏళ్ల కందిమళ్ల సుహాసిని రెడ్డి గల్లంతైనట్లు సమాచారం. ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుహాసిని.. కైలాష్ మానస సరోవర్ యాత్రలో భాగంగా నేపాల్‌కు వెళ్లారు. ఆకస్మిక వరద ధాటికి గల్లంతైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

సుహాసిని భర్త సంజీవ్ రెడ్డి కాగా.. శ్రీహాన్, సమయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొత్తగా ఎల్‌బీనగర్‌లో ఇల్లు కొనుగోలు చేయడంతో ఆగస్టు 19వ తేదీన చిన్న కుమారుడు సమయ్‌తో హైదరాబాద్‌కు వచ్చారు. అనంతరం ఢిల్లీ మీదుగా ఖాట్మండూకు వెళ్లి, అక్కడ ఆస్ట్రేలియాకు చెందిన స్నేహితురాలిని కలిశారు. ఇద్దరూ కలిసి నేపాల్‌లో పర్యటించారు. ఆగస్టు 25న కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సుహాసిని చిన్న కుమారుడు సమయ్ సెప్టెంబర్ 14న తన పుట్టినరోజు సందర్భంగా తల్లి తిరిగి వచ్చి సర్‌ప్రైజ్ ఇస్తుందని ఎదురుచూస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదిలా ఉండగా.. నేపాల్ వరదల్లో తెలంగాణకు చెందిన 23 మంది ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఆరుగురు తెలంగాణ నివాసులు కాగా, 17 మంది తెలంగాణ మూలాలున్న ప్రవాస భారతీయులుగా గుర్తించారు. ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి 80-100 వరకు ఫోన్ కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక పరిశీలన అనంతరం 20 కేసులను తదుపరి సమన్వయం కోసం గుర్తించారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 30 మంది నేపాల్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. తెలంగాణకు చెందిన 23 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు. వీరిలో కొందరి ఆచూకీ లభించగా, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది.

మరోవైపు నేపాల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారతీయులు సహా పలువురు విదేశీ పర్యాటకుల ఆచూకీ కోసం స్థానిక అధికారులు, రాయబార కార్యాలయాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. భారీగా దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థల కారణంగా సహాయక చర్యలకు సవాళ్లు ఎదురవుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ, హైదరాబాద్‌లో హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేసి కేంద్ర విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. కుటుంబ సభ్యులు తమ బంధువుల వివరాలను అధికారులకు అందించి, తాజా సమాచారం కోసం అధికారిక హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. కాగా, నేపాల్‌లో మృతుల సంఖ్య 469 దాటగా, వందలాది మంది ఇంకా గల్లంతయ్యారు. కొత్తగా ఏర్పడిన నీటి నిల్వలు పొంగిపొర్లే ప్రమాదం ఉండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us