అమెరికాలో గన్ కల్చర్ మళ్లీ పెట్రేగిపోతోంది.. చదువుకోడానికెళ్లిన యువత ప్రాణాలను తీస్తున్న గన్ కల్చర్.. తాజాగా మరొకరి ప్రాణం తీసింది..అగ్రరాజ్యం అమెరికాలో ఓ దుండగుడి కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతిచెందాడు.. వాషింగ్టన్ ఏవ్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.. ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం ముందు జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది..
హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని ఆర్కే పురం, గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ 2022 మార్చిలో అమెరికా వెళ్లాడు. అక్కడ మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలోనే.. వాషింగ్టన్ ఏవ్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ మృతి చెందాడు..
రవితేజ మరణవార్త విన్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లోని అతని నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ రవితేజ తండ్రి విలపిస్తున్నారు. తన బాధ ఎవరికీ చెప్పుకోలేనిది అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.
పెచ్చుమీరిపోతున్న తుపాకీ సంస్కృతికి గతంలో చాలామంది తెలుగు విద్యార్థులు బలైపోయారు. యూఎస్‌లో గన్‌కల్చర్ కారణంగా పదుల సంఖ్యలో భారతీయ విద్యార్థులు ప్రాణాలు పోయాయి.. చదువుకోడానికెళ్లిన విద్యార్థులు చావును కొనితెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొనడంతో అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.. అమెరికా వెళ్లి చదువుకోవాలని, అక్కడ ఉద్యోగం సంపాదించాలని చాలా మంది భారతీయ యువత కల. దాని కోసం ఎంత కష్టపడైనా, ఆర్థికంగా మంచి స్థాయిలో లేకపోయినా ఎన్నో కష్టాలు ఓర్చుకుని బాధలు అనుభవించి విదేశాలకు పయనమయ్యే యువతీయువకులు ఎంతో మంది ఉన్నారు.. కానీ, అలాంటి అగ్ర రాజ్యంలో మనిషి ప్రాణాలకు రక్షణ లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తుంది. భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలని భావించే ఎంతో మంది భారతీయ పౌరుల కల.. కలగానే మిగిలిపోతుందంటూ పలువురు పేర్కొంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..