మంటల్లో అపార్ట్‌మెంట్లు.. 44 మంది మృతి.. 279 మంది మిస్సింగ్.. ఘోర ప్రమాదం ఎలా జరిగిందంటే..?
Hong Kong Fire Accident: హాంకాంగ్‌లోని తైపో వాంగ్ ఫక్ కోర్టులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 44 మంది మరణించగా, 279 మంది గల్లంతయ్యారు. వెదురు గోడలు, నిర్మాణ నెట్ తొలగించకపోవడం, బలమైన గాలులు మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమయ్యాయి. హాంకాంగ్ చరిత్రలో 17 ఏళ్ల తర్వాత ఇదే అతిపెద్ద అగ్నిప్రమాదం కావడం గమనార్హం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

హాంకాంగ్‌లోని తైపో ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. వాంగ్ ఫక్ కోర్టు అనే నివాస సముదాయంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 44 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. . మరోవైపు, ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు 279 మంది కనిపించడం లేదని అధికారులు ప్రకటించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గాయపడిన వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంటలు వేగంగా వ్యాపించడానికి కారణాలు
వాంగ్ ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్‌లో 8 బ్లాకులు ఉన్నాయి. ఒక్కో బ్లాక్‌లో 31 అంతస్తుల నిర్మాణం ఉంది. దాదాపు 2,000 అపార్ట్‌మెంట్లలో 4,800 మంది నివసిస్తున్నారు. మంటలు ఇంత వేగంగా వ్యాపించడానికి ప్రధాన కారణాలను అధికారులు గుర్తించారు. ఈ అపార్ట్‌మెంట్‌ల బయటి గోడల నిర్మాణం వెదురు బొంగుతో చేశారు. అదేవిధంగా కన్‌స్ట్రక్షన్ సమయంలో వాడిన నెట్ తొలగించలేదు. మంటలు వ్యాపించే సమయంలో భారీగా గాలులు వీయడం వల్ల అగ్నికీలలు ఇతర టవర్లకూ పాకి, అవి కూడా తగలబడ్డాయి.
ముగ్గురు అరెస్ట్
హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ ఈ భారీ అగ్నిప్రమాదంపై స్పందించారు. అత్యవసర బృందాలు కనిపించకుండా పోయిన వారి కోసం వెతుకుతున్నాయని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాన్ని పరిశోధించడానికి పోలీసులు, అగ్నిమాపక విభాగం ఇప్పటికే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా ఈ ఘటనకు కారణమైన ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సంతాపం వ్యక్తం చేశారు.
భారీ నష్టం
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో మంటలు, దట్టమైన పొగ ఆకాశమంతటా వ్యాపించి ఉండటం కనిపించింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 700 మంది అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీస్, భద్రతాదళాలు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. దాదాపు 90శాతం మంది నివాసితులను భవనం నుండి సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు.
చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం..
హాంకాంగ్ చరిత్రలోనే అతిపెద్ద విపత్తులలో ఇదీ ఒకటిగా నిలుస్తోంది. హాంకాంగ్‌లో ఇంతటి తీవ్రత గల లెవల్ 5 అగ్నిప్రమాదం జరగడం సుమారు 17 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 17 ఏళ్ల క్రితం జరిగిన లెవల్ 5 అగ్నిప్రమాదంలో నలుగురు మరణించారు. అగ్నిమాపక శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ, సమీపంలోని నివాసితులు ఇంటి లోపలే ఉండాలని, తలుపులు, కిటికీలు మూసి ప్రశాంతంగా ఉండాలని సూచించింది.
This fire in Hong Kong’s Tai Po district killed at least 13 people (including a fire man). It’s raging out of control through 7 of 8 towers of this public housing development that’s home to more than 4,000 people#HongKong pic.twitter.com/vZvljZrclM
— Ivan Watson (@IvanCNN) November 26, 2025
