Hajj 2021 – Saudi Arabia: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి ఇప్పటికే పలు దేశాల్లో కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ప్రారంభం కానున్న హజ్ యాత్రకు సౌదీ అరేబియా ప్రభుత్వం పరిమితులు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి యాత్రలో పాల్గొనేందుకు 60వేల మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టంచేసింది. అది కూడా 18 నుంచి 65 ఏళ్ల లోపు వయసు ఉండి.. కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిన సౌదీ అరేబియా ప్రజలే ఈ యాత్రలో పాల్గొనేందుకు అర్హులని పేర్కొంది. ఈ మేరకు శనివారం సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది.
గతేడాది కూడా కరోనా విజృంభిస్తుండటంతో హజ్ యాత్రకు సౌదీ అరేబియాలో నివసిస్తున్న కేవలం 1000 మందికే అవకాశం కల్పించారు. సాధారణంగా హజ్‌యాత్రలో పాల్గొనేందుకే ఏటా 160 దేశాల నుంచి లక్షలాది మంది ముస్లింలు సౌదీకి పర్యటనకు వస్తుంటారు. ఈ యాత్రలో పాల్గొనే వారిలో చాలా మంది విదేశీయులే ఉంటారు. కానీ ఈసారి కరోనా కొత్త వేరియంట్లతో ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో విదేశీలయుకు అవకాశం కల్పించడంలేదని సౌదీ అరేబియా స్పష్టంచేస్తూ ప్రకటనను విడుదల చేసింది. కరోనా కారణంగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Also Read: