కస్టమర్‌లాగా వచ్చి కాల్చి చంపాడు.. అమెరికాలో గుజరాతీ వ్యక్తి దారుణ హత్య..!
అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తిని అతి దారుణంగా కాల్చి చంపారు. ఉపాధి నిమిత్తం గుజరాత్ రాష్ట్రం నుంచి అమెరికా వెళ్లిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి కిరాతకంగా హత్య చేశాడు ఓ దుండగుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తిని అతి దారుణంగా కాల్చి చంపారు. ఉపాధి నిమిత్తం గుజరాత్ రాష్ట్రం నుంచి అమెరికా వెళ్లిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి కిరాతకంగా హత్య చేశాడు ఓ దుండగుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా మన దేశం నుంచి ఎంతో మంది ఉపాధి పనుల నిమిత్తం పొరుగు దేశాలకు వెళ్లడం చూస్తూ ఉంటాం. ఆ క్రమంలోనే అమెరికా వెళ్లి అక్కడ సంపాదించుకుని భవిష్యత్తు కోసం పాటుపడేవాళ్లు కూడా ఎంతో మంది. ఇదే రీతిలో గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ – కలోల్ పరిధిలోని గుండిచా గ్రామానికి చెందిన పరేష్ పటేల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా అమెరికా వెళ్లి పని నిమిత్తం అక్కడే ఉంటూ ఒక దుకాణంలో పని చేస్తున్నాడు. అయితే.. ఎప్పటిలాగే బుధవారం (మే 21) దుకాణంలో పని చేసుకుంటున్న అతని వద్దకు కస్టమర్‌లా వ్యవహరిస్తూ ఓ వ్యక్తి వచ్చాడు. మొదట ఏదో కావాలి అన్నట్లుగా మామూలుగానే అడగ్గా.. పరేష్ ఆ వస్తువును ఇచ్చి అందుకు చెల్లించాల్సిన నగదును తీసుకున్నాడు.
ఆ మరుక్షణమే దుండగుడు నగదు కౌంటర్ వద్ద పరేష్ పటేల్ నుంచి డబ్బును లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. డబ్బు ఇచ్చేయమని అన్నట్లు తుపాకీ చూపించి బెదిరించాడు. ఊహించని ఈ హఠాత్తు పరిణామానికి పటేల్ భయపడిపోయి ఏం చేయాలో తెలియక అతను చెప్పినట్లే చేశాడు. సాయం కోసం అర్థించాలని అనుకున్నా సమయానికి అక్కడ ఎవరూ లేని పరిస్థితి. దిక్కుతోచనిస్థితిలో బిక్కుబిక్కుమంటూ పటేల్ తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని దుండగుడికి అప్పగించాడు. అతను అంతటితో విడిచిపెట్టి వెళ్లకుండా మొత్తం డబ్బును దోచుకున్న వెంటనే పటేల్‌ను కాల్చి చంపాడు.
డబ్బు తీసుకున్న వెంటనే ఆ దుండగుడు కాల్చడంతో అక్కడికక్కడే పరేష్ కుప్పకూలిపోయాడు. ఆపై మరోసారి అతనిని గమనించి చనిపోయాడా లేదా అని నిర్ధారించుకోవడానికి ఆ దుండగుడు మళ్లీ మరోసారి కాలుస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఎక్కడో పొరుగు దేశం వెళ్లి కష్టం చేసుకుని బతుకుదామనుకున్న పరేష్ లాంటి వ్యక్తి ఇలా కాల్పుల్లో చనిపోవడం అతని స్వగ్రామం గుండిచాలో తీవ్ర విషాదం నింపింది. మృతుడికి అప్పటికే పెళ్లి కూడా అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ద్వారా దుండగుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
