Telugu man killed in US: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. డబ్బు కోసం ఓ దుండగుడు.. భారత సంతతి వ్యాపారవేత్తపై కాల్పులు జరిపాడు. 80 కిలోమీటర్లు వెంబడించి మరి ఆ వ్యాపారవేత్తను కాల్చి చంపినట్లు న్యూజెర్సీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో ఉంటున్న తెలుగు రాష్ట్రానికి చెందిన శ్రీరంగ అరవపల్లి (54) ఔరెక్స్ లేబరేటరీస్ పేరుతో ఓ ఫార్మా సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత మంగళవారం అర్ధరాత్రి వరకు ఫిలడెల్ఫియాలోని ఓ క్లబ్‌లో అరవపల్లి క్యాసినో ఆడారు. అనంతరం 10 వేల డాలర్లతో ఇంటికి పయనమయ్యారు. ఆయన వద్ద పెద్దమొత్తంలో డబ్బు ఉండడాన్ని గమనించిన ఓ దుండగుడు ఆ సొమ్మును దోచుకునేందుకు ప్రణాళిక రచించాడు.
క్యాసినో ప్రదేశం నుంచి శ్రీరంగను వెంబడిస్తూ వెళ్లాడు. అలా దాదాపు 80 కిలోమీటర్లపాటు కారును వెంబడిస్తూ వెళ్లాడు. శ్రీరంగ న్యూజెర్సీలోని ఇంటికి చేరుకుని.. లోపలికి వెళ్తున్న సమయంలో దుండగుడు ఆయన్ను అడ్డుకున్నాడు. డబ్బు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో శ్రీరంగ ప్రతిఘటించారు. దీంతో దుండగుడు తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆయనపై కాల్పులు జరిపాడు. అనంతరం ఆయన దగ్గరున్న డబ్బును తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటన తెల్లవారుజామున 3.30గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు.
సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెన్సిల్వేనియాలోని నోరిస్‌టౌన్‌కు చెందిన నిందితుడు 27 ఏళ్ల రీడ్ జాన్‌ను అరెస్ట్ చేశారు. శ్రీరంగ అరవపల్లి మరణించడంతో ఆయన కుటుంబం విషాదం మునిగింది. అందరితో కలిసి మెలసి కలివిడిగా ఉండే శ్రీరంగ మరణించడంతో కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువారు కన్నీరుమున్నీరయ్యారు. అరవపల్లికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Also Read: