Smriti Irani: మన కేంద్ర మంత్రులలో ఎక్కువగా అందరికీ తెలిసిన మంత్రి ఎవరు అని అడిగితే ఎక్కువ మంది స్మృతి ఇరానీ పేరు చెబుతారు. తన మాటల తూటాలతో ప్రత్యర్ధి పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేయడంలో ఆమె టాప్‌లో ఉంటారు. తరచూ ప్రజల మధ్యలో కనిపిస్తూ ఉంటారు. దానితో మీడియాలోనూ ఈమెకు స్మబంధించిన వార్తలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఇప్పుడు కేంద్ర మంత్రిగా విజయవంతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న స్మృతి అంత ఈజీగా ఈ స్థాయికి చేరుకోలేదు. ఆమె జీవితంలో ఎంతో కష్టపడ్డారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన స్మృతి తన కెరీర్ లో హోటల్‌లో వెయిట్రెస్‌గా కూడా పనిచేశారంటే ఆమె జీవితంలో ఎన్ని ఎగుడు దిగుళ్ళు చూశారో అర్ధం చేసుకోవచ్చు. జీరో నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవడం అంటే మాటలు కాదు. అదీ మన దేశంలో ఒక మహిళ రాజకీయాలను తన మార్గంగా మార్చుకుని పై స్థాయిలోకి చేరుకోవడం చాలా కష్టమైన పని. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన స్మృతి ఇరానీ జీవిత విశేషాలు తెలుసుకుంటే ఇప్పటి యువతరానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
తండ్రికి సహాయం చేయడానికి..
స్మృతి ఢిల్లీలోని మల్హోత్రా కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పంజాబీ – తల్లి అస్సామీ. స్మృతి ఇంటి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా ఉండేది కాదు. తండ్రి కొరియర్ కంపెనీ నడిపేవారు. స్మృతి పాఠశాల విద్య తర్వాత కరస్పాండెన్స్‌తో తన బి.కామ్ చదువును ప్రారంభించారు. కానీ, పూర్తి చేయలేకపోయారు. ఆ సమయంలో ఆమె ఒక హోటల్‌లో వెయిట్రెస్‌గా కూడా పనిచేశారు.
తన తండ్రికి ఆర్ధికంగా సహాయం చేయడానికి, ఆమె ఢిల్లీలో సౌందర్య ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో, ముంబైలో తన అదృష్టాన్ని పరీక్షించుకోమని ఒకరు ఆమెకు సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ముంబైకి వచ్చారు. 1998లో, ఆమె మిస్ ఇండియా కోసం ఆడిషన్ చేసి ఎంపికయ్యారు. కానీ, ఆమె తండ్రి పోటీలో పాల్గొనడానికి నిరాకరించారు. చివరికి ఆమె తల్లి ఆదుకుంది. అమ్మ ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేసి స్మృతికి ఇచ్చింది. పోటీలో స్మృతి ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే, గెలవలేకపోయారు. ఆ డబ్బును తన తల్లికి తిరిగి ఇచ్చేయడానికి, స్మృతి ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించారు. జెట్ ఎయిర్‌వేస్‌లో ఫ్లైట్ అటెండెంట్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ ఎంపిక కాలేదు. చాలా మోడలింగ్ ఆడిషన్స్‌లో కూడా ఆమె తిరస్కరణకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె కొన్ని రోజులు ప్రైవేట్ ఉద్యోగం చేశారు.
అత్తగా పనికిరావన్నారు..
‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’ (2000-08)లో తులసి విరానీగా పేరు తెచ్చుకున్న స్మృతి ఇరానీ, తాను ఎప్పుడూ ఫిట్‌గా లేనందున ఏక్తా కపూర్ బృందం తనను తిరస్కరించిందని ఒకసారి చెప్పారు. అప్పుడు ఏక్తా కపూర్ ఆమెకు మద్దతు ఇచ్చారు. ఆ సీరియల్ లో ప్రధాన పాత్రను ఇచ్చారు. ఆ పాత్రతో స్మృతి విధి మారిపోయింది.
జుబిన్ ఇరానీతో వివాహం..
2001లో పార్సీ వ్యాపారవేత్త జుబిన్ ఇరానీని వివాహం చేసుకోవడంతో ఆమె స్మృతి ఇరానీగా ప్రసిద్ధి చెందారు. అక్టోబర్ 2001లో, ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చారు. అతనికి జోహార్ అని పేరు పెట్టారు. రెండు సంవత్సరాల తరువాత, అంటే సెప్టెంబర్ 2003లో, ఆమె కుమార్తె జోయిష్‌కు తల్లి అయింది. వారికి షానెల్ అనే సవతి కూతురు కూడా ఉంది. షానెల్ జుబిన్ ఇరానీ మొదటి భార్య మోనా కుమార్తె.
రాజకీయ ప్రయాణం అలా..
స్మృతి ఇరానీ చిన్నప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగం. ఆమె తాత ఆర్ఎస్ఎస్(RSS) వాలంటీర్. తల్లి జన్ సంఘీ. దీంతో 2003లో బీజేపీలో స్మృతి ఇరానీ చేరారు. మహారాష్ట్ర యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ 2004లో ఎంపిక అయ్యారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 2010లో స్మృతి బీజేపీ జాతీయ కార్యదర్శిగా, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో యూపీలోని అమేథీ స్థానం నుంచి రాహుల్ గాంధీపై లోక్‌సభకు పోటీ చేసి ఇక్కడ కూడా ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి అమేథీ పార్లమెంట్ నుంచి ఆమె గెలిచారు. స్మృతి ఇరానీ ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: INS Vela: భారత నేవీలోకి నిశ్శబ్ద ఆయుధం ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి.. మెరుపుదాడితో శత్రువుల పని పట్టేస్తుంది!
OPPO EV: ఒప్పో నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కార్లు.. భారత్‌లో ఈవీలను తీసుకురానున్న మొబైల్ కంపెనీలు!
GDP: పరుగులు తీయనున్న భారత్ జీడీపీ.. ప్రపంచ స్థాయి సంస్థల అంచానా.. ఏ సంస్థ ఎంత అంచనా వేస్తోందంటే..