Gaza Fire Accident: గాజాలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు చిన్నారులు సహా 21 మంది దుర్మరణం..

|

Nov 18, 2022 | 8:01 AM

పాలస్తీనాలోని గాజా నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పార్టీ జరుగుతుండంగా.. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు.

Gaza Fire Accident: గాజాలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు చిన్నారులు సహా 21 మంది దుర్మరణం..
Gaza Fire Accident
Follow us on

పాలస్తీనాలోని గాజా నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పార్టీ జరుగుతుండంగా.. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన గాజా స్ట్రిప్‌లోని ఓ భవనంలో చోటుచేసుకుంది. పార్టీ జరుగుతున్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని.. చూస్తుండంగానే భవనం మొత్తానికి మంటలు అంటుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 21 మరణించగా.. చాలామంది గాయపడినట్లు ఆరోగ్య విభాగం అధికారులు వెల్లడించారు. గాజాలో అత్యధిక జనాసాంధ్రత ఉండే జబాలియా శరణార్థుల క్యాంపు ప్రాంతంలోని భవనంలో మంటలు చెలరేగాయని.. ఈ సమయంలో భవనంలో పార్టీ జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

మొదట చివరి అంతస్తులో మంటలు అంటుకున్నాయని, క్రమంగా అవి బిల్డింగ్‌ మొత్తానికి వ్యాప్తి చెందాయని వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే.. అధికార యంత్రాంగం అక్కడికి చేరుకుందని.. మంటలను అదుపుచేయడానికి చాలా సమయం శ్రమించాల్సి వచ్చిందన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గురైన భవనంలో పెద్ద మొత్తంలో గ్యాసోలిన్ నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మంటలు చెలరేగాయని.. అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఈ ఘటనపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దీనిని జాతీయ విషాదంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఒకరోజు సంతాప దినంగా ప్రకటించారు. కాగా.. అగ్ని ప్రమాదం కారణాన్ని గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతోందని హమాస్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..