అంతర్జాతీయంగా ఉగ్రవాదులకు అందుతున్న ఆర్ధిక సాయాన్ని అడ్డుకునేలా చేస్తున్న సూచనల్ని పాక్ ఏమాత్రం పాటించడం లేదని ఎఫ్ఏటీఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్లాండోలో జరిగిన ప్లీనరీ సమావేశంలో పాక్ ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటిఎఫ్) హెచ్చరించింది. ఇప్పటికే గత జూన్ నెలలో గ్రే లిస్ట్ లో పెట్టినప్పటికీ దాని బుద్ధి మార్చుకోలేదని తెలిపింది. ఉగ్రవాదాన్ని అరికట్టడం, అక్రమంగా నగదు చలామణి చేయడం లాంటి అంశాల్లో చేసిన సూచనల్ని అక్టోబర్ నాటికైనా చేరుకోవాలని పాక్ కు సూచించింది.
ఇప్పటికే గ్రే లిస్ట్ లో ఉన్న పాక్ తన పద్ధతి మార్చుకోకపోతే బ్లాక్ లిస్ట్ లో చేర్చాల్సి వస్తుందని హెచ్చరించింది ఎఫ్ఏటీఎఫ్. మరోవైపు ఉగ్రసంస్ధల విషయంలో ఎఫ్ఏటీఎఫ్ సూచనలు ఖచ్చితంగా పాటించాలని తెలిపింది. అలాగే ఉగ్రవాదులకు అందుతున్న సాయం, వసతులు, సౌకర్యాల వివరాలన్నీ తమ ముందుంచాలని కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే 27సూత్రాలతో కూడిన కార్యాచరణను పాక్ ముందుంచింది ఎఫ్ఏటీఎఫ్. కానీ ఇప్పటికీ వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు.
గ్రే లిస్ట్ లో ఉంచడం వల్ల అంతర్జాతీయ ఆర్ధిక సంస్ధలైన ఐఎంఎఫ్, ప్రపంచ ఆసియా బ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్, ఐరోపా యూనియన్ వంటి సంస్ధలు పాకిస్తాన్ స్ధాయిని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉగ్ర సంస్ధలకు అందుతున్న సాయాన్ని బయటపెట్టకపోవడం, ఎఫ్ఏటీఎఫ్ సూచనలను కనీసం పాటించకపోవడంతో పాక్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైన ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులతో సతమతమవుతోంది. ఇలాంటి సమయంలో ఎఫ్ఏటీఎఫ్ సూచనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరముంది. దీనికి ససేమిరా అంటే మాత్రం ఆర్ధికపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నట్టే.