Elon Musk: అంతరిక్షంలోనే అద్భుతాలు చేశాడు.. మస్క్‌ మామూలోడు కాదబ్బ..

అవును.. మొనగాడు మస్క్‌. అంతరిక్షంలో అద్భుతాలు చేశాడు. టెక్నాలజీతో తెగ ఆడేసుకున్నాడు. అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేసి చూపించాడు. ట్రంప్‌ గెలుపుతో అమెరికా పాలిటిక్స్‌లో సైతం సూపర్‌స్టార్‌గా మారాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా..9 నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను..సేఫ్‌గా భూమికి రప్పించాడు. దీంతో ప్రపంచం మరోసారి.."వారేవా మస్క్‌" అంటోంది..

Elon Musk: అంతరిక్షంలోనే అద్భుతాలు చేశాడు.. మస్క్‌ మామూలోడు కాదబ్బ..
Elon Musk'

Updated on: Mar 19, 2025 | 1:58 PM

ఎలాన్‌ మస్క్ అంటే Xకి బాస్..స్పేస్‌ Xకి అధినేత..టెస్లాకు హోల్ అండ్ సోల్ ఓనర్‌.. స్టార్‌లింక్‌ అధిపతి.. ఇదంతా నిన్నటివరకు. ఇప్పుడు స్పేస్‌ఎక్స్‌ క్రూ-10 మిషన్‌ సక్సెస్‌తో.. నాసాను మించిన ఖ్యాతి సాధించారు మస్క్‌.. 2024 జూన్‎లో ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బచ్‌ విల్మోర్, నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ మిషన్ క్రూ 9 ప్రాజెక్ట్‎లో భాగంగా బోయింగ్‌ స్టార్‌లైనర్‌ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. నాసా షెడ్యూల్ ప్రకారం స్పేస్‎లో వీరి పర్యటన వారం రోజులు. కానీ.. వీరు వెళ్లిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌‎లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ తిరిగి భూమి పైకి రాగా.. సునీత, బచ్‌ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వీరిని తిరిగి భూమీ మీదకు తీసుకొచ్చేందుకు నాసా పలుమార్లు ప్రయత్నించినా..అవి సక్సెస్‌ కాలేదు. దీంతో సునీతా, బచ్‌ విల్మోర్ 9 నెలల పాటు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్.. స్పేస్‎లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా, విల్మోర్‎ను భూమిపైకి తీసుకురావాడానికి మస్క్‌ సాయం కోరారు. దీంతో రంగంలోకి దిగిన మస్క్‌.. స్పేస్‎ఎక్స్ మిషన్‌తో వారిని భూమికి క్షేమంగా రప్పించారు.

స్పేస్‌-ఎక్స్‌ ప్రయోగంపై నాసా కీలక ప్రకటన

డ్రాగన్‌ వ్యోమనౌక ప్రయోగం విజయవంతమైందన్న నాసా.. వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చామని ప్రకటించింది.. స్పేస్‌-ఎక్స్‌, నాసా సమష్టి కృషితోనే సేఫ్ ల్యాండింగ్ జరిగిందని తెలిపింది. ఈ సందర్భంగా స్పేస్‌-ఎక్స్‌కి ధన్యవాదాలు తెలిపింది.. వ్యోమగాములు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని.. కొన్నిరోజులు నాసా పర్యవేక్షణలో ఉంటారని తెలిపింది.

ట్రంప్‌ గెలుపులో మస్క్‌దే కీలకపాత్ర..

ట్రంప్‌ గెలుపు కోసం..ట్రంప్‌కంటే ఎక్కువగా శ్రమించారు మస్క్‌. తనకున్న ఫాలోయింగ్‌తో పవర్‌ ఫుల్‌ క్యాంపెయిన్‌ రన్ చేశారు. ప్రజల్లో ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకతను సైతం అనుకూలంగా మార్చేలా..మస్క్‌ తన వ్యూహ, ప్రతివ్యూహాలతో ఆకట్టుకున్నారు. దీంతో రిపబ్లికన్‌ పార్టీ విక్టరీలో మస్క్‌కే అగ్రభాగం ఇచ్చారు ట్రంప్‌. మస్క్ అనుకుంటే అయిపోద్ది అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో మస్క్‌ పాలిటిక్స్‌లోనూ స్టార్‌ అయిపోయారు. అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏర్పాటైన.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీలో కీలకపాత్ర పోషిస్తున్నారు..మస్క్‌. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, శాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది..డోజ్‌. ఈ పదవిని ఏరికోరి తీసుకున్నారు..మస్క్‌.

కారులో వెళ్లినంత ఈజీగా స్పేస్ క్రాఫ్ట్‌ ప్రయాణం

టెస్లా కార్ల ఉత్పత్తితో ప్రపంచంలోనే సంపన్నుడిగా ఎదిగిన మస్క్..ఇప్పుడు అంతకు మించి ఆలోచిస్తున్నారు. కారులో రోడ్డు మీద ప్రయాణించినంత ఈజీగా..స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షానికి వెళ్లేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు..మస్క్. గతంలో అంతరిక్ష సంస్థలు ఎప్పుడూ రాకెట్లను తిరిగి ఉపయోగించాలనే ఆలోచన చేయలేదు. అయితే ఎలాన్ మాస్క్ కొత్తగా ఆలోచించారు. రాకెట్లను తిరిగి ఉపయోగించే టెక్నాలజీని తీసుకువచ్చారు. తన ప్రయోగం ద్వారా రాకెట్‌ నుంచి విడిపోయిన 71 మీటర్ల బూస్టర్‌..30 నిమిషాల తర్వాత ప్రయోగించిన చోటుకే వచ్చి సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. తద్వారా స్పేస్‌ ఎక్స్‌.. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక తన న్యూరలింక్‌ సంస్థ ద్వారా మెదడును ఆపరేట్‌ చేసే చిప్‌పై కూడా మస్క్ పరిశోధనలు చేయిస్తున్నారు.

ఒక్క ట్వీట్‌పెట్టి 44 బిలియర్‌ డాలర్లకు ట్విట్టర్‌ కొనేసిన మస్క్‌

భవిష్యత్‌లో మానవులకు ఏ ఏ రంగాల్లో ఎక్కువగా అవసరం ఉంటుందో వాటిని ముందే గుర్తించి ఆయా రంగాలో దూసుకుపోతున్నారు. ఎలాన్ మస్క్ ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎంతో వేగంగా అమలు చేస్తారు. ఇదే ఆయన సక్సెస్ సీక్రెట్ అంటారు. అందుకే లేటెస్ట్‌ సెల్‌ఫోన్‌ కొన్నంత ఈజీగా..కేవలం ఒక్క ట్వీట్‌పెట్టి 44 బిలియర్‌ డాలర్లకు ఖర్చుపెట్టి ట్విట్టర్‌ కొనేశారు మస్క్‌. గతంలో కూడా ఎలాన్ మస్క్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో కొన్ని విజయాలను అందిస్తే.. మరికొన్ని ఓటములను మిగిల్చాయి. మనకు మస్క్ అనగానే టెస్లా గుర్తుకు వస్తుంది. ఈ కంపెనీ కొన్నేళ్ల కిందట దివాలా అంచులకు చేరింది. ఇక ఎలాన్ మస్క్ సంగతి అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఎలన్ మస్క్ కుంగిపోలేదు. పడిపోయిన చోటే మళ్లీ లేచినిల్చున్నారు. టెస్లాను విజయ పథంలో నడిపించారు. విజయమైనా..ఓటమైనా..ఒకే యాటిట్యూడ్‌తో ఎలాన్ మస్క్‌ ముందుకు వెళ్తున్నారు.

మరిన్న అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..