ఎప్పుడు ఆసక్తికర ట్వీట్లు చేస్తూ వార్తాల్లో నిలిచే ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ మరో నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు కథనాలు వస్తున్నాయి. తన కంపెనీలకు చెందిన ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఓ పట్టణాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తోనట్లు అమెరికాకు చెందిన ఓ ప్రముఖ వార్త పత్రిక తన నివేదికలో వెల్లడించింది. ఎలాన్ మస్క్ కంపెనీలకు సంబంధించిన సంస్థలు వేల ఎకరాలు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు ఆస్టిన్ కు దగ్గర్లోని దాదాపు 3,500 ఎకరాల్లో స్థలాలను కొనుగోలు చేసినట్లు తెలిపింది.
ఎలాన్ మస్క్ కు చెందిన బోరింగ్, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల ఉద్యోగులు మార్కెట్ రేటు కంటే తక్కువగానే కొత్త ఇళ్లల్లో ఉండేలా చేయాలని మస్క్ కోరుతున్నట్లు సమాచారం. దాదాపు 100 కు పైగా కొత్త ఇళ్లు నిర్మించాలని అలాగే స్విమ్మింగ్ పూల్స్, ఔట్ డోరు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు నివేదిక తెలిపింది. 2020లో ఎలాన్ మస్క్ టెస్లా ప్రధాన కార్యాలయాన్ని, తన వ్యక్తిగత నివాసాన్ని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ కు మారుస్తున్నట్లు ప్రకటించాడు. 2022లో టెస్లా ఓ కొత్త గిగాఫ్యాక్టరీ తయారీ కేంద్రాన్ని ప్రారంభించగా, స్పేస్ ఏక్స్, బోరింగ్ కంపెనీలకు సైతం టెక్సాస్ లో సౌకర్యాలు కలిగి ఉన్నాయి.