DOGE: భారత్‌కు డోజ్‌ సాయాన్ని నిలిపివేసిన అమెరికా.. బీజేపీ స్పందన ఇదే..

భారత ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు నిర్థేశించిన 21 మిలియన్ డాలర్ల సాయాన్ని రద్దు చేస్తునట్టు ట్రంప్‌ సర్కార్‌ ప్రకటించింది. భారత్‌లో విపక్షాలకు సాయం చేసేందుకే డోజ్‌ ఈ సాయాన్ని ప్రకటించిందని, ఎలన్‌ మస్క్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తునట్టు బీజేపీ ప్రకటించింది. బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌పీసింగ్ మాట్లాడుతూ.. భారత అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యం అవసరం లేదన్నారు.

DOGE: భారత్‌కు డోజ్‌ సాయాన్ని నిలిపివేసిన అమెరికా.. బీజేపీ స్పందన ఇదే..
Trump Elon Musk

Updated on: Feb 16, 2025 | 9:53 PM

డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక అమెరికా విదేశీ విధానం పూర్తిగా మారిపోతోంది. ప్రభుత్వ వ్యయాన్ని కట్టడి చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృథా వ్యయం కట్టడే లక్ష్యంగా రూపొందించిన డోజ్ విభాగం సంచలన నిర్ణయాలను ప్రకటించింది. వివిధ దేశాలకు అమెరికా అందించే నిధులకు కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్లను రద్దు చేసినట్లు ప్రకటించారు డోజ్‌ చీఫ్‌ ఎలన్‌ మస్క్‌.

విదేశాలకు సాయం అందించడంతో అమెరికా భారీగా నష్టపోతుందన్నారు మస్క్‌. అందుకే నిధుల కోతను విధిస్తునట్టు సమర్ధించుకున్నారు. విదేశాలకు సాయంతో అమెరికాకు ఎలాంటి లాభం లేదన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

భారత్‌లో ఓటింగ్‌ను పెంచేందుకు నిర్ధేశించిన అమెరికా సాయాన్ని నిలిపివేయడంపై బీజేపీ స్పందించింది. భారత్‌లో ఓటింగ్‌ పెరిగితే ఎవరికి లాభం.. అధికార పార్టీకి మాత్రం కాదు.. విపక్షాలకు లాభం చేసేందుకు అప్పటి బైడెన్‌ అధ్యక్షుడు కుట్ర చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. మస్క్‌ నిర్ణయాన్ని స్వాగతించారు బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌పీసింగ్‌.

భారత అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని , భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు జార్జ్‌ సోరస్‌ కుట్ర చేశారని ఆర్‌పీసింగ్‌ అన్నారు.

భారత్‌ మాత్రమే కాదు.. బంగ్లాదేశ్‌కు కూడా సాయం నిధుల్లో భారీగా కోత విధింంచారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ స్థిరత్వాన్ని పెంచేందుకు అందిస్తున్న 29 మిలియన్‌ డాలర్లకు కూడా డోజ్‌ కోత విధించింది. మాజీ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా తరువాత మహ్మద్‌ యూనస్‌ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..