United States: అగ్రరాజ్యంలో ఓటుకు నోటు.. నోట్లు కురిపించి ఓటర్లను ఆకర్షిస్తున్న ఎలన్ మస్క్
అగ్రరాజ్యంలో ఓటుకు నోటు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ట్రంప్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న శ్రీమంతుడు ఎలన్ మస్క్ రంగంలోకి దిగారు. పెన్సిల్వేనియా ఓటర్లకు భారీ నజరానా ప్రకటించారు. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి...
ఒక్క ఓటుకు అక్షరాలా ఎనిమిది కోట్ల 40 లక్షల రూపాయలు. మనదేశంలో ఎనిమిది కోట్లు పెడితే అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఖర్చు పెట్టేయొచ్చు. కానీ అమెరికా సంపన్నుడు ఎలన్‌మస్క్ మాత్రం ఒక్కరోజుకు ఒక్క ఓటుకు ఖర్చుపెడుతున్నారు. దటీజ్ మస్క్. ఓటర్లకు ఆయన ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇది.
డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా రిపబ్లికన్ పార్టీ కోసం పనిచేస్తున్న ఎలన్ మస్క్, ఒక సర్‌ప్రైజ్ అంటూ ప్రకటన చేశారు. అమెరికా PAC పిటిషన్‌కు మద్దతుగా సంతకం చేసిన వారిలో ఒకరిని లక్కీ డిప్‌తో ఎంపిక చేసి, ఒక మిలియన్ డాలర్ల నజరానా ఇస్తున్నట్లు ప్రకటించారు. PAC అంటే పొలిటికల్ యాక్షన్ కమిటీ అని అర్థం. పెన్సిల్వేనియా రిపబ్లికన్ పార్టీ గెలుపు కోసం మస్క్ చేసిన మహా ప్లాన్ ఇది.
ప్రకటన చేయడమే గాదు, అదే వేదిక మీద ఒక లక్కీ మ్యాన్‌కు మిలియన్ డాలర్ల చెక్ అందించారు. ఈ అదృష్టవంతుడి పేరు జాన్ డ్రెహర్. ఇలా నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరిగే వరకు రోజుకొకరికి మిలియన్ డాలర్ల చెక్ ఇస్తానని మస్క్ చెప్పారాయన. చెక్ అందుకున్న వ్యక్తి, ఎన్నికలు అయ్యేంత వరకు ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం చేయాలి. మస్క్ విధించిన షరతు ఇది.
ఎలన్ మస్క్ ఇంత డబ్బు ఓటర్లకు ఎందుకు ఇస్తున్నాడు. వాళ్లంతా మద్దతు తెలపాల్సిన అంశాలు ఏంటి? అన్నది అసక్తికరమైన పాయింట్. ట్రంప్ పార్టీ చెబుతున్నట్లు అమెరికా రాజ్యాంగానికి మద్దతు ఇవ్వాలి. గన్స్‌కు అనుకూలంగా గళమెత్తాలి. అలాగే ఫ్రీ స్పీచ్‌కు మద్దతు పలకాలి. వీటన్నిటికోసం మస్క్ ఇంతటి భారీ నజరానా ఇస్తున్నారు.
ఎలన్ మస్క్ డబ్బులివ్వడం ఇదేమీ కొత్త కాదు. ట్రంప్‌కు తన మద్దతు తెలుపుతూ, ఆయన ప్రచారవర్గానికి వ్యక్తిగతంగా 75 మిలియన్ డాలర్ల ఇచ్చేశారు. ఇక పెన్సిల్వేనియా ఓట్లరకు రోజుకు మిలియన్ డాలర్ల ఆఫర్ తాజాగా చేశారు. అంతేగాదు, పెన్సిల్వేనియా అవతల ఉన్న రాష్ట్రాల్లో ఓటర్లు రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేసి, PACకి అనుకూలంగా సంతకం చేస్తే 47 డాలర్లు ఇస్తారట. ఇలా సంతకం చేయాలని రిఫర్ చేసిన వారికి కూడా 47 డాలర్లు ఇస్తారట.
ఓటుకు నోటు అంటే ఇదే. డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కోవడం అంటే ఇదే. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి పాఠాలు చెప్పే అగ్రరాజ్యంలో బట్టబయలైన వింత ఇది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ ఇప్పుడు ఓట్లను పెద్దమొత్తానికి పెన్సిల్వేనియాలో కొనేస్తున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..