Donald Trump: ఆఫ్గన్‌లో మళ్లీ మొదలైన అరాచక తాలిబన్ల శకం.. బైడెన్ రాజీనామా చేయాలన్న ట్రంప్
Afghanistan - Donald Trump: ఆఫ్గనిస్థాన్‌లో అరాచక తాలిబన్ల శకం మళ్లీ మొదలయ్యింది. ఆఫ్గనిస్థాన్ అధ్యక్ష భవంతి సహా అన్ని ప్రాంతాలను తాలిబన్లు తమ చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు.
Afghanistan – Donald Trump: ఆఫ్గనిస్థాన్‌లో అరాచక తాలిబన్ల శకం మళ్లీ మొదలయ్యింది. ఆఫ్గనిస్థాన్ అధ్యక్ష భవంతి సహా అన్ని ప్రాంతాలను తాలిబన్లు తమ చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని దేశం విడిచి పారిపోయారు. దేశంలో మరింత రక్తపాతం ఏర్పడటం ఇష్టంలేకే దేశం విడిచి వెళ్లిపోతున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అటు ఆఫ్గనిస్థాన్‌లో ఉంటున్న విదేశీయులు కూడా భారీ సంఖ్యలో కాబుల్ విమానాశ్రయం నుంచి నిష్క్రమించారు. దేశంలో యుద్ధం ముగిసినట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆఫ్గనిస్థాన్ అధికార పగ్గాలను తాలిబన్లు సొంతం చేసుకున్నారు. ఆఫ్గనిస్థాన్ నుంచి తమ సేనల నిష్క్రమణకు ఆగస్టు 31 వరకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ గతంలో డెడ్‌లైన్ ఇవ్వగా.. రెండు వారాలకు ముందే ఆదివారంనాడు తాలిబన్లు ఆఫ్గన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఆఫ్గనిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులపై అమెరికాలో తీవ్ర రాజకీయ వివాదం రాజుకుంది. ఆఫ్గన్‌లో నెలకొన్న పరిస్థితులకు అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ వైఫల్యమే కారణమని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ దుస్థితికి బాధ్యతవహిస్తూ అధ్యక్ష పదవికి బైడెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు దేశంలో కోవిడ్-19 విజృంభన, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, అమెరికాలోకి వలసలు పెరగటానికి బైడెన్ చేతగానితనమే కారణమంటూ విమర్శించారు. ఆఫ్గన్ విషయంలో బైడెన్ ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. అమెరికా చరిత్రలో అతి ఘోరమైన ఓటముల్లో ఒకటిగా ఆఫ్గన్ పరాభవం ఎప్పటికీ నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.
అయితే ట్రంప్ ఆరోపణలను జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తిప్పికొట్టింది. ఆఫ్గన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు తాలిబన్లతో డీల్ (దోహా డీల్) కుదుర్చుకునేందుకు ట్రంప్ చర్చలు జరిపారని గుర్తుచేశారు. సుదీర్ఘ యుద్ధాలను ముగించాలని అమెరికాలోని మెజార్టీ ప్రజలు కోరుకున్నట్లు వ్యాఖ్యానించారు.
అయితే అఫ్గనిస్థాన్ నుంచి అమెరికా సేనల నిష్క్రమణను సరిగ్గా నిర్వహించడంలో జో బైడెన్ విఫలం చెందారని స్వదేశంలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడి పరిస్థితులను సరిగ్గా అంచనావేయడంలో బైడెన్ విఫలం చెందారని రాజకీయ ప్రత్యర్థులు, మీడియా సంస్థలు ఆరోపిస్తున్నాయి.
Also Read..
Atal Bihari Vajpayee: వాజ్‌పేయీ తృతీయ వర్ధంతి.. ప్రధాని మోడీ సహా ప్రముఖుల నివాళులు.. చిత్రాలు
Covid-19: కరోనా కళ్ల ద్వారా కూడా శరీరంలోకి ప్రవేశిస్తుందా..? అయితే లక్షణాలు ఏమిటి..?