ఒక పంటికి బదులు మరో పన్ను పీకిన డాక్టర్! అందం చెడిపోయిందని యువతి ఊహించని నిర్ణయం
అన్హుయ్ ప్రావిన్స్‌లోని ఒక మునిసిపల్ ఆసుపత్రిలో జరిగిన దారుణ ఘటనలో, జ్ఞానదంత నొప్పితో వైద్యుడిని సంప్రదించిన యువతి, వేరే పంటి తొలగింపు వల్ల తీవ్రమైన బాధను అనుభవించింది. వైద్యుని నిర్లక్ష్యం, ఆమె అనేక ఫిర్యాదుల తరువాత కూడా పరిష్కారం లభించకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.

ఓ యువతి పంటి నొప్పితో డెంటిస్ట్ దగ్గరికి వెళ్లింది. తనకు ఒక పన్ను నొప్పిగా ఉందని, దాన్ని తీసేయాలని కోరింది. అయితే.. కంగారులో ఆ డెంటిస్ట్ నొప్పి ఉన్న పన్నుకు బదులుగా మరో పన్ను తొలగించాడు. అంతే.. తన అందం మొత్తం చెడిపోయిందని ఎవరూ ఊహించని పని చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.. ఈ సంఘటన అన్హుయ్ ప్రావిన్స్‌లోని ఒక మున్సిపల్ ఆసుపత్రిలో జరిగింది. ఓ యువతికి జ్ఞానదంతాలు రావడంతో నొప్పి కలిగింది.
దీంతో ఆమె ఆ జ్ఞానదంతాలను తొలగించుకోవడానికి ఓ డెంటిస్ట్ దగ్గరికి వెళ్లింది. కానీ డాక్టర్ తప్పుగా అర్థం చేసుకుని ఆరోగ్యకరమైన పంటిని తొలగించాడు. తరువాత, వైద్యుడు తప్పును గ్రహించి, పంటికి ఒక తీగను పెట్టి అదే స్థలంలో సరిచేశాడు. దీని వల్ల ఆమెకు విపరీతమైన బాధ కలిగింది. ఎటువంటి ఇంజెక్షన్లు లేకుండా గంటన్నర పాటు శస్త్రచికిత్స జరిగింది. పంటిని తిరిగి యధాస్థానంలో అమర్చడానికి ప్రయత్నించడం వల్ల చిగుళ్ళు వాచిపోయి, అందమైన ముఖం పూర్తిగా మారిపోయింది. రోజుల తరబడి ఆమె పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేకపోయింది.
నొప్పితో నిద్ర కూడా పట్టేది కాదు. దీనికి పరిష్కారం చెప్పమని, నొప్పి తగ్గించమని అడిగినా డాక్టర్ స్పందించలేదు. ఆ తర్వాత ఆమె ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఈ సమస్య గురించి పదే పదే ఆసుపత్రి వారికి ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి పరిష్కారం లభించలేదని చెప్పి ఆత్మహత్య చేసుకుంది. మార్చి 17న ఆసుపత్రికి వెళ్లి, ఆస్పత్రి బిల్డింగ్ ఎక్కి 11వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అలాగే ఆస్పత్రి వాళ్లు ఆమెకు వైద్యం చేసిన డాక్టర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.