ఖైదీలను వదలని కోవిడ్.. జైల్లో 112 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్.. ఆందోళనలో జైలు అధికారులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విబృంభిస్తోంది. ఈ వైరస్ జైల్లో ఉండే ఖైదీలకు సైతం సోకుతోంది. అలాంటి ఘటన ఇప్పుడు పాక్‌లో కలకలం రేపుతోంది. పాకిస్థాన్‌లోని సింధ్ జైలులో 112 మంది...
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విబృంభిస్తోంది. ఈ వైరస్ జైల్లో ఉండే ఖైదీలకు సైతం సోకుతోంది. అలాంటి ఘటన ఇప్పుడు పాక్‌లో కలకలం రేపుతోంది. పాకిస్థాన్‌లోని సింధ్ జైలులో 112 మంది ఖైదీలకు కరోనా సోకినట్లు జైలు అధికారులు గుర్తించారు. జైలులో మొదట 31 మంది ఖైదీలకు సోకగా, కేవలం పది రోజుల్లో ఆ సంఖ్య 112కు చేరింది. పది రోజుల్లో ఖైదీల కుటుంబ సభ్యుల ములాఖత్ వల్లనే సింధ్ జైలులోని ఖైదీలకు కరోనా సోకిందని జైళ్ల శాఖ ఐజీ ఖాజి నజీర్ అహ్మద్ వెల్లడించారు. కరోనా కలకలంతో సింధ్ జైలుకు వచ్చిన కొత్త ఖైదీలను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నామని ఆయన తెలిపారు.
ఈ సింధ్ ప్రాంతంలోని 22 జైళ్లల్లో 18 వేల మంది ఖైదీలున్నారు. సింధ్ జైళ్ల సామర్థ్యం 13 వేలు కాగా, ఎక్కువ మంది ఖైదీలున్నారని తెలుస్తోంది. కరాచీలోని మాలీర్ జిల్లా జైలులో 70 కరోనా కేసులు నమోదు కాగా, కరాచీ సెంట్రల్ జైలులో 33 మంది ఖైదీలకు కరోనా సోకింది. పాక్ దేశంలో మొత్తం 4,43,246 మందికి కోవిడ్ సోకగా, వారిలో 8,905 మంది మరణించారు. ఈ సింధ్ జైల్లో కేవలం పది రోజుల్లోనే 112 మందికి కోవిడ్ సోకడం అధికారుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. జైల్లో, పరిసర ప్రాంతాల్లో శానిటైజ్ చేయిస్తున్నారు.
కాగా, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 16,30,029 మంది వరకు మరణించారు. పాజిటివ్ కేసులు ఏడు కోట్లు దాటేశాయి. ఇక అమెరికాలో కోవిడ్ సెకండ్ వేవ్ ఆరంభమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇక రోజువారీగా పరిశీలిస్తే కొత్త కేసుల్లో అమెరికా తర్వాత రష్యా, భారత్, టర్కీ, బ్రెజిల్ ఉన్నాయి. మొత్తం మరణాల్లో చూస్తే అమెరికా మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మరణాల్లో అమెరికా తర్వాత బ్రెజిల్, భారత్, మెక్సికో, ఇటలీ ఉన్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా టాప్‌లో ఉంది. ఆ తర్వాత మెక్సికో, రష్యా, ఇటలీ, భారత్ ఉన్నాయి.