
భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా దురాక్రమణ వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారతీయ మహిళను చైనా అధికారులు షాంఘై విమానాశ్రయంలో సుదీర్ఘంగా నిర్బంధించి, వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనను బాధితురాలు పెమా వాంగ్ థాంగ్ డోక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ నెల 21న లండన్ నుండి జపాన్‌కు వెళ్తున్న ఆమె షాంఘైలో విమానం మారడానికి దిగింది. ఆమె పాస్‌పోర్ట్‌ను చూసిన చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఆమె జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తించారు. దానితో “అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనా దేశంలో భాగం. కాబట్టి మీ భారతీయ పాస్‌పోర్ట్ చెల్లదు” అని వారు స్పష్టం చేశారు. ఆమెను అవమానించడమే కాకుండా వారికి సహకరించిన చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది కూడా ఆమెను ఎగతాళి చేసి “మీరు చైనా పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసుకోండి” అని సలహా ఇచ్చారు.
18 గంటల పాటు నిర్బంధంలో ఉన్న ఆమెకు కనీసం ఆహారం, విమానాశ్రయ సౌకర్యాలు కూడా ఇవ్వలేదు. ఆమె తదుపరి విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. చివరకు కొత్త టికెట్ కొనుగోలు చేస్తేనే ఆమె పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇచ్చారు. దీనివల్ల ఆమెకు ఆర్థికంగా నష్టం జరిగింది. దీంతో నిస్సహాయురాలైన థాంగ్‌డోక్ UKలోని ఒక స్నేహితుడి ద్వారా షాంఘైలోని భారతీయ కాన్సులేట్‌కు సమాచారం అందించింది. భారతీయ అధికారుల జోక్యం తర్వాత ఆమెను రాత్రి ఆలస్యంగా విడుదల చేశారు.
ఈ ఘటనను “దేశ సార్వభౌమాధికారానికి అవమానం” అని ఆమె అభివర్ణించింది. విదేశాలకు వెళ్లే అరుణాచల్ ప్రజలందరినీ ఇలాంటి వివక్ష నుండి కాపాడాలని ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. ఈ సంఘటన భారతీయులలో ఆగ్రహాన్ని తెప్పించింది. సోషల్ మీడియాలో నెటిజన్లు చైనా తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా భారత ప్రభుత్వం ఎప్పుడూ అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో భాగమనే వాదనలను ఖండిస్తూనే ఉంది. అరుణాచల్‌పై చైనా ఎన్ని పేర్లు మార్చినా అది భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుందనే వాస్తవాన్ని మార్చలేరని భారత్ గతంలో స్పష్టం చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.