
China vs Taiwan: రష్యా అన్నంత పని చేసింది. ఎదిరిస్తే దాడులు తప్పవంటూ ఉక్రెయిన్‌ను హెచ్చరించిన రష్యా.. ఆ తరువాత దాడులకు తెగబడింది. అయితే, ఇప్పుడు ప్రపంచం మొత్తం చైనా వైపే చూస్తోంది. రష్యా అయిపోయింది.. ఇక చైనా వంతు వచ్చిందా? అన్నట్లు చూస్తున్నారు. అవును, చైనా దండెత్తుతుందా? ఇప్పుడు తైవాన్ ప్రజల భయం ఇదే. అందుకే ఆ దేశ అధ్యక్షురాలు ఇంగ్వెన్ సహా అందరూ గన్స్ పట్టి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అవును, తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ ఇలా రాకెట్ లాంచర్‌ను భుజాన వేసుకున్నారు. అది ఎలా పని చేస్తోందో పరిశీలించారు. ఇటీవలి కాలంలో ఆమె తరచూ సైన్యంతో భేటీ అవుతున్నారు. సైనిక దళాలను కలుసుకుంటూ వారిలో మనో స్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాను కూడా తుపాకీ పేల్చడం, రాకెట్ ప్రయోగించడం ఎలాగో తెలుసుకుంటున్నారు త్సాయ్ ఇంగ్ వెన్.
మరోవైపు తైవాన్ యువత తుపాకులు పేల్చడం ఎలాగే నేర్చుకుంటున్నారు. శిక్షణా కేంద్రంలో తుపాకీకి ఎలా పట్టుకోవాలి? గురి తప్పకుండా ఎలా పేల్చాలో శిక్షణ తీసుకుంటున్నారు. గతంలో ఎప్పడూ తుపాకీని చూడని వారు, టూర్ ఆపరేటర్ నుంచి టాటూ ఆర్టిస్ దాకా అందరూ శిక్షణా కేంద్రాలకు వెళ్లి అభ్యాసం చేస్తున్నారు. తైపీ సహా తైవాన్‌లో పలు ప్రాంతాల్లో ఈ ట్రైనింగ్ సెంటర్లు మొదలయ్యాయి.
ఉక్రెయిన్ మీద రష్యా దాడికి మద్దతు పలికిన తర్వాత తైవాన్‌లో ఆందోళన మొదలైంది. చైనా ఎప్పుడైనా తమ దేశంపై దాడి చేయవచ్చని వారు భావిస్తున్నారు. చైనాతో యుద్ధం ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తైవాన్ సిద్ధమైంది. ఇటీవలి కాలంలో తైవాన్ సైన్యం పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు మొదలు పెట్టింది. తాజాగా తైవాన్ గగణతలంలో చైనా యుద్ధ విమానాలు తిరగడంతో ఆ దేశంలో మరింత ఆందోళన మొదలైంది. మరోవైపు తెవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ అమెరికా ప్రతినిధులను కలుపుకోవాడాన్ని చైనా తప్పు పట్టింది.