Brazil President Jair Bolsonaro fined: రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ అన్నట్లు… చట్టం ముందు అందరూ సమానులే అని నిరూపిస్తున్నారు బ్రెజిలియన్స్. తప్పు చేస్తే దేశ అధ్యక్షుడైనా శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు. అనడమే కాదు.. అధ్యక్షుడిపై కేసు నమోదు చేశారు.
మన రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానులే అనే నిబంధన ఉంది. అయితే మన దగ్గర ఎంత వరకు అమలవుతుందో తెలియదు కానీ.. బ్రెజిల్‌లో మాత్రం తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఏకంగా అధ్యక్షుడిపైనే కేసు నమోదు చేసి జరిమానా సైతం విధించారు.
కరోనా వైరస్ విజృంభణ కారణంగా బ్రెజిల్ దేశం అల్లాడిపోయింది. గతంలో విపరీతంగా కరోనా కేసులు, మరణాలు పెరగడంతో ఆ దేశ అధ్యక్షుడు ఏం చేయలేని పరిస్థితి అంటూ కంటతడి కూడా పెట్టుకున్నారు. అయితే, అంతటి విధ్వంసం జరిగిన తర్వాత కూడా దేశ అధ్యక్షుడు బాధ్యత లేకుండా ప్రవర్తించడంపై అక్కడి జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, మాస్క్ పెట్టుకోలేదని కేసు కూడా నమోదు చేశారు.
బ్రెజిల్‌లోని మారన్‌హవో రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం వందమందికిపైగా పాల్గొనే సమావేశాల జరపకూడదని నిషేధం అమలులో ఉంది. వీటితో పాటు మాస్క్ ధరించని వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే, మారన్‌హవో రాజధాని సావో లూయిస్ నగరంలో జరిగిన ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఈ రూల్స్‌ని బ్రేక్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మాస్క్ కూడా ధరించలేదు.
దీనిపై మారన్‌హవో రాష్ట్ర గవర్నర్ ఫ్లావియో డైనో స్పందించారు. ఆ ప్రాంతంలో ఉన్న కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు గాను అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై అధికారులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రోత్సహించేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో కేసు నమోదు చేశామని గవర్నర్ తెలిపారు.
Read Also… Money Heist: మనీ హెయిస్ట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా సీజన్ 5.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!