Australian Court: భారత మాజీ రాయబారికి రూ. 53 లక్షలు జరిమానా.. చేసిన నేరం ఏంటో తెలుసా?

భారత మాజీ హైకమిషనర్ నవదీప్ సింగ్ సూరికి భారీ జరిమానా విధించింది ఆస్ట్రేలియన్ కోర్టు. తన ఇంటి పనిమనిషికి 60 రోజుల్లోగా 97,200 డాలర్లు అంటే సుమారు 53,29,500 రూపాయల పరిహారం చెల్లించాలని ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఆదేశించింది.

Australian Court: భారత మాజీ రాయబారికి రూ. 53 లక్షలు జరిమానా.. చేసిన నేరం ఏంటో తెలుసా?
Navdeep Singh Ssuri
Follow us

|

Updated on: Mar 21, 2024 | 4:24 PM

భారత మాజీ హైకమిషనర్ నవదీప్ సింగ్ సూరికి భారీ జరిమానా విధించింది ఆస్ట్రేలియన్ కోర్టు. తన ఇంటి పనిమనిషికి 60 రోజుల్లోగా 97,200 డాలర్లు అంటే సుమారు 53,29,500 రూపాయల పరిహారం చెల్లించాలని ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఆదేశించింది. తొమ్మిది కేసుల్లో నవదీప్ సింగ్ ఆ దేశంలోని ‘ఫెయిర్ వర్క్ యాక్ట్’ను ఉల్లంఘించేలా ఉన్నాయని కోర్టు పేర్కొంది. నవదీప్ సింగ్ సూరి తన పనిమనిషితో ప్రవర్తించిన తీరు దోపిడీ, బానిసలా ఉందని న్యాయమూర్తి అన్నారు.

నవదీప్ సూరి ఏప్రిల్ 2015 నుండి నవంబర్ 2016 వరకు ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్‌గా పనిచేశారు. అంతకంటే ముందు అతను ఈజిప్టులో రాయబారిగా పనిచేశారు. అతను సెప్టెంబర్ 2019లో పదవీ విరమణ చేసే వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారత రాయబారిగా ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో నవదీప్ సూరి తన పనిమనిషి సీమా షెర్గిల్ హక్కులను విస్మరించాడని కోర్టు అంగీకరించింది. 2015 ఏప్రిల్‌లో ఆస్ట్రేలియా చేరుకున్న సీమా షెర్గిల్ దాదాపు ఏడాదిపాటు కాన్‌బెర్రాలోని సూరి ఇంట్లో పనిచేసింది.

నవదీప్ సూరి ఇంట్లో 13 నెలలు పనిచేసిన తర్వాత, ఆమెకు కేవలం 3,400 ఆస్ట్రేలియన్ డాలర్లు మాత్రమే వేతనంగా లభించాయి. ఆమె ఇల్లు శుభ్రం చేయడం, ఆహారం సిద్ధం చేయడం, తోట శుభ్రం చేయడం, కుక్కను చూసుకోవడం వంటివి చేసేది. ఎనిమిది బెడ్ రూమ్‌లు ఉన్న ఇంటి నిర్వహణ బాధ్యత అంతా సీమ భుజస్కంధాలపైనే పడింది. సీమా షెర్గిల్‌పై సూరి విధించిన తీవ్రమైన పని పరిమితులను కూడా కోర్టు ఖండించింది. ఆమె పాస్‌పోర్ట్‌ను లాక్కొని, వరుసగా ఏడు రోజులు సెలవు లేకుండా పని చేయించినట్లు సీమా షెర్గిల్ కోర్టుకు వివరించింది. సూరి కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లవలసి వచ్చినప్పుడు మాత్రమే ఆమెను ఇంటి నుండి బయటకు వెళ్లడానికి అనుమతించారని పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే ఫెయిర్ వర్క్ యాక్ట్‌లోని నాలుగు వేర్వేరు సెక్షన్లను నవదీప్ సూరి ఉల్లంఘించాడని, తన పనిమనిషికి తక్కువ జీతం ఇచ్చాడని ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు పేర్కొంది. 60 రోజుల్లోగా 97,200 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే సుమారు 53,29,500 రూపాయలను సీమా షెర్గిల్‌కు తిరిగి చెల్లించాలని నవదీప్ సూరిని కోర్టు ఆదేశించింది. దీంతోపాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. సీమా షెర్గిల్ మే 2016లో సూరి ఇంట్లో పని చేయడం మానేసింది.

సీమా షెర్గిల్ తర్వాత ఆస్ట్రేలియా ఫెయిర్ వర్క్ అంబుడ్స్‌మన్ నుండి సహాయం కోరింది. దీంతో ఆమెను అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ అయిన సాల్వేషన్ ఆర్మీకి పంపించారు. 2021లో ఆస్ట్రేలియా పౌరసత్వం లభించింది. కాగా, ఫిర్యాదులను భారత్‌లోనే పరిష్కరించాలని ఆస్ట్రేలియా కోర్టు అధికార పరిధిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వ్యతిరేకించింది. ఆస్ట్రేలియన్ పౌరసత్వం పొందేందుకు నవదీప్ సూరిపై సీమా షెర్గిల్ నిరాధార ఆరోపణలు చేశారని MEA ఆరోపించింది. ఆమె ప్రవర్తన, తప్పుడు ప్రాతినిధ్యాలు ఆస్ట్రేలియాలో శాశ్వతంగా ఉండాలనే కోరికతో ఇదంతా చేసినట్లు భారత విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles