విమానంలో తరలిస్తున్న భారీ మొత్తాన్ని దోచుకునేందుకు ఓ దొంగల ముఠా పడరాని పాట్లు చేసింది. సినీ ఫక్కీలో ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చి డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమవడంతో దుండగులను అడ్డుకోగలిగారు. వివరాల్లోకి వెళ్తే.. చిలీ రాజధాని శాంటియాగోలో ఈ ఘటన జరిగింది. ఫ్లోరిడాలోని మియామీ నుంచి 32.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.262 కోట్లు) నగదును ప్రత్యేక విమానంలో బుధవారం చిలీకి తీసుకొచ్చారు. చిలీలోని పలు బ్యాంకులకు తరలించాల్సిన ఆ నగదుకు సంబంధించిన వివరాలు తిలిసిన ఓ దొంగల ముఠా.. శాంటియాగోలోని ఆర్తురో మెరినో బెనిటెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానం దిగగానే అందులోని డబ్బును ఓ సాయుధ ట్రక్కులోకి తరలిస్తుండగా దాడి చేసింది. వాహనాలతో సహా విమానాశ్రయ గేటును బద్దలుకొట్టి ఆ ముఠా రన్‌వేపైకి చొచ్చుకొచ్చింది.
ఆ క్రమంలో కొందరు దొంగలు అయితే ఏకంగా భద్రతా సిబ్బందిపైనే దాడి చేసి వారి ఆయుధాలను లాక్కున్నారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు పోలీసులు వెంటనే వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల ఘటనలో విమానాశ్రయంలోని ఓ సెక్యూరిటీ ఉద్యోగి మృతిచెందగా.. నిందితుల్లో ఒకడు హతమయ్యాడు. ఇక మిగతవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కాగా, ఘటన తర్వాత డబ్బు సురక్షితంగానే ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు శాంటియాగో ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘరానా దోపిడీలు కొత్తేమీ కాదు. 2020లో అయితే ఓ దొంగల ముఠా ఎయిర్‌పోర్టులోని ఓ గోదాంలో ఉంచిన 15 మిలియన్ డాలర్ల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లింది. అంతకుముందు ఆరేళ్ల క్రితం కూడా 10 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు కూడా చోరీకి గురయ్యాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..