Iran protests: ఇరాన్‌లో తీవ్రమవుతోన్న హిజాబ్‌ వ్యతిరేక నిరసనలు.. 185కి చేరిన మృతుల సంఖ్య..

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సహా దేశ వ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై వివక్షాపూరిత చట్టాలను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నిరసనల్లో యువతీ యువకులతో..

Iran protests: ఇరాన్‌లో తీవ్రమవుతోన్న హిజాబ్‌ వ్యతిరేక నిరసనలు.. 185కి చేరిన మృతుల సంఖ్య..
Hijab Protest In Iran (file photo)

Updated on: Oct 10, 2022 | 6:40 AM

హిజాబ్‌ వ్యవహారం ఇరాన్‌లో రోజురోజుకీ తీవ్రమవుతోంది. హిజాబ్‌ సరిగా ధరించలేదన్న కారణంగా అరెస్టయి పోలీసులు కస్టడీలో మరణించిన మహ్సా అమిని ఉదంతంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఇరాన్‌ మహిళలతో పాటు కొందరు యువకులు రోడ్ల మీదికొచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే హదీస్‌ నజాఫీ అనే మరో యువతిని ఇరాన్‌ భద్రతా దళాలు కాల్చి చంపడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. దీంతో దేశ వ్యాప్తంగా హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మరింత తీవ్రంగా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సహా దేశ వ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై వివక్షాపూరిత చట్టాలను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నిరసనల్లో యువతీ యువకులతో పాటు పాఠశాల విద్యార్థినులు కూడా పాల్గొంటున్నారు.. కరాజ్‌ పట్టణంలో ఓ ప్రభుత్వాధికారికి వ్యతిరేకంగా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేస్తూ వాటర్‌ బాటిల్స్‌ అతనిపై విసిరేశారు. ఇక ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఆస్తులకు నిరసనకారులు నిప్పుపెడుతున్నారు. ఆందోళనాకారులను అదుపుచేయడానికి పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగిస్తున్నారు. ఇరాన్‌ వ్యాప్తంగా హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనల్లో ఇప్పటి వరకూ 185 మంది మరణించినట్లు ఇరాన్ మానవ హక్కుల సంఘం తెలిపింది. మరణించిన వారితో 19 మంది పిల్లలు కూడా ఉన్నారు.

దాదాపు 20 మంది రివల్యూషనరీ గార్డులు, పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఆందోళనాకారులు ప్రభుత్వ టీవీ ప్రసారాలను హ్యాక్‌ చేశారు. వార్తలు ప్రసారమవుతున్న సమయంలో దేశ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ తలను టార్గెట్‌ చేస్తున్న చిత్రాలు టీవీ స్క్రీన్‌ మీద కనిపించాయి. ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీంరైసీ అల్-జహ్రా యూనివర్శిటీని సందర్శించినప్పుడు అక్కడి విద్యార్థినులు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. మరి ఇరాన్‌లో మొదలైన ఈ హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలకు ఎక్కడ ఫుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..