Afghanistan Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ కాలకేయులు రెచ్చిపోతున్నారు. ఆటవిక శిక్షలతో తాలిబన్ల రక్తచరిత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. మహిళలపై ఆంక్షలతో ప్రారంభమైన తాలిబన్ల పాలన.. బహిరంగ ఉరిశిక్షలు, నరికివేతలు లాంటి చట్టాల వరకూ వెళ్లింది. కఠిన షరియా చట్టాలను అమలు చేస్తూ నరరూప రక్షసుల్లా ప్రవర్తిస్తున్న తాలిబన్లు.. తాజాగా మరో దారుణానికి పాల్పడ్డారు. అఫ్గాన్‌లోని హజారా వర్గానికి చెందిన 13 మందిని తాలిబన్లు దారుణంగా చంపారు. వీరంతా తాలిబన్లకు లొంగిపోయిన ఆఫ్ఘన్ సైనికులని.. వారందరినీ తాలిబన్లు పొట్టనపెట్టుకున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. డేకుండి ప్రావిన్స్‌లోని కహోర్ గ్రామంలో.. ఆగస్ట్ 30వ తేదీన హజారా వర్గానికి చెందిన 13 మందిని దారుణంగా చంపినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. మృతుల్లో 11 మంది అఫ్గాన్ భద్రతా సిబ్బంది కాగా 17 ఏళ్ల బాలిక సహా ఇద్దరు పౌరులున్నారని ఆమ్నెస్టీ వెల్లడించింది. ఈ వార్తలపై వివరణ కోరేందుకు అసోసియేటెడ్ ప్రెస్ ప్రతినిధి ఫోన్ ద్వారా యత్నించగా తాలిబన్‌లు స్పందించలేదని తెలిపింది.
ఆఫ్ఘన్‌లోని డేకుండి ప్రావిన్స్ ఆగస్ట్ 14వ తేదీన తాలిబన్ల హస్తగతమైంది. దీంతో ఖిదిర్ ప్రాంతంలోని 34 మంది సైనికులు.. తమ ఆయుధాలతో తాలిబన్లకు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. అనంతరం ఆగస్ట్ 30న సైనికులు ఉన్న ప్రాంతానికి చేరుకున్న సుమారు 300మంది తాలిబన్లు.. వారిపై విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించారు. కాల్పుల్లో ఇద్దరు సైనికులతోపాటు, మసుమా అనే బాలిక, మరో వ్యక్తి చనిపోయారు. మాజీ సైనికుడు జరిపిన కాల్పుల్లో ఒక తాలిబన్ చనిపోగా మరొకరు గాయపడ్డట్లు ఆమ్నెస్టీ తెలిపంది.
ఈ ఘటన అనంతరం లొంగిపోయిన సైనికుల్లో 9 మందిని తాలిబన్లు.. సమీపంలోని నది వద్దకు తీసుకెళ్లి కాల్చి దారుణంగా చంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆమ్నెస్టీ వివరించింది. ఆమ్నెస్టీ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ మాట్లాడుతూ.. హజారాలను దారుణంగా చంపడం తాలిబన్లు మారలేదనడానికి నిదర్శని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆఫ్ఘన్లో గతంలో అధికారంలో ఉండగా తాలిబన్లు కొనసాగించిన అకృత్యాలను, దారుణాలను తిరిగి సాగిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
Also Read: