Bomb Blast: రంజాన్ వేళ విషాదం చోటు చేసుకుంది. ఆనందోత్సవాల మధ్య పండగ జరుపుకోవాలని మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్న వారిపై బాంబు దాడి జరిగింది. ప్రశాంతంగా ప్రార్థనలు జరుగుతున్న మసీదులో ఒక్కసారిగా బాంబు పేలుడుతో రక్తసిక్తమైపోయింది. బాంబు పేలడంతో 12 మంది మృతి చెందారు. ఈ ఘటన ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో చోటు చేసుకుంది. శుక్రవారం ఓ మసీదులో ప్రార్థనలు ప్రారంభమైన కొద్దిసేపటికే బాంబు పేలింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, చాలా మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై ఏ ఉద్రవాద, తీవ్రవాద సంస్థ కానీ స్పందించలేదని కాబూల్ పోలీసులు వెల్లడించారు.అయితే ఇమామాన్‌ను టార్గెట్ చేసే బాంబు పెట్టారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయమై మహిబుల్లాహ్ సాహేబ్‌జాదా అనే వ్యక్తి మాట్లాడుతూ ‘నేను మసీదులోకి అడుగు పెడుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. మసీదు నుంచి పొగలు వస్తున్నాయి. మసీదు కళ్లముందే ధ్వంసమైంది. పెద్దలు, పిల్లల అరుపులు, ఏడుపుల శబ్దాలు వినిపిస్తున్నాయి. మసీదు మొత్తం పొగతో నిండిపోయింది. లోపలికి వెళ్తుంటే చాలా మంది రక్తపు మడుగులో కనిపించారు.. అని అన్నారు.
కాగా, అసలు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మూడురోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని అఫ్గాన్ ప్రభుత్వం తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, బాంబు దాడితో మారణ హోమం జరిగింది. ఈ దాడికి తాలిబన్లే కారణమని ఇంకా నిర్ధారణ కాకపోగా వారిపనిగానే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.