వాషింగ్టన్, మే 12: ఈ ఏడాది మార్చి నెలలో ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోగికి జన్యుపరంగా మార్పు చెందిన పంది కిడ్నీ మార్పిడి చేసిన సంగతి తెలిసిందే. మనుషుల ప్రాణాలు కాపాడే యత్నంలో భాగంగా 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ అనే రోగికి అమెరికా వైద్యులు పంది కిడ్నీని అమర్చి వైద్య చరిత్రలోనే సంచలనం సృష్టించారు. బతికున్న మనిషికి జంతువు అవయవం అమర్చడం ఇదే తొలిసారి. అయితే ఈ ఆపరేషన్ జరిగిన కేవలం రెండు నెలలకే ఆతను మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు శనివారం ప్రకటించారు.
మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో నాలుగు గంటల పాటు జరిగిన శస్త్రచికిత్సలో వైద్యులు విజయ వంతంగా పంది కిడ్నీని అమర్చారు. ఆపరేషన్ జరిగిన రెండు వారాల తర్వాత ఏప్రిల్‌లో డిశ్చార్జ్ అయ్యాడు. అయితే అతను తాజాగా ఆకస్మాత్తుగా మృత్యువాత పడ్డాడు. అతని మృతికి కారణం తెలియనప్పటికీ.. ఖచ్చితంగా ఇది కిడ్నీ మార్పిడికి సంబంధించినది కాదని ఆసుపత్రి ధృవీకరించింది. రిక్ స్లేమాన్ ఆకస్మిక మృతిపై మాస్ జనరల్ ట్రాన్స్‌ప్లాంట్ బృందం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇటీవల కిడ్నీ మార్పిడి వల్ల అతను మరణించలేదని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ ఓ ప్రకటనలో స్పఫ్టం చేసింది.
మసాచుసెట్స్‌లోని వేమౌత్‌లో నివసిస్తున్న రిచర్డ్ స్లేమాన్.. కిగ్నీ మార్పిడికి ముందు నుంచే టైప్ 2 డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నాడు. డిసెంబర్ 2018లో మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో మనిషి కిడ్నీ మార్పిడి జరిగింది. సుమారు ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత అది కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అవడంతో మే 2023 నుంచి స్లేమాన్ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో పంది కిడ్నీ విజయవంతంగా అమర్చడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలేనన్ని ట్రాన్స్‌ప్లాంట్ రోగులకు స్లేమాన్ ఆశాజ్యోతిగా కనిపించాడు. జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ రంగంలో ముందుకు సాగడానికి ఒక దారి కనిపించినట్లైంది.
మార్పిడికి ఉపయోగించిన కిడ్నీ కేంబ్రిడ్జ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈజెనెసిస్ నుండి వచ్చింది. ఈ అవయవం CRISPR-Cas9 సాంకేతికతను ఉపయోగించి జన్యుపరంగా మార్పు చెందిన పంది నుంచి సేకరించారు. కిడ్నీ మార్పు ప్రక్రియలో అనుకూలత లేని పంది జన్యువులను పూర్తిగా తొలగించి, గ్రహీత శరీరంతో అనుకూలతను పెంచడానికి నిర్దిష్ట మానవ జన్యువులను జోడించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.కానీ స్లేమాన్ హఠాత్తుగా మరణించడం వెనుక ఖచ్చితమైన కారణం వైద్యులకు ఇంకా తెలియరాలేదు. కిడ్నీకి అతని మృతికి ఎలాంటి సంబంధం ఉండబోదని వారు చెబుతున్నారు. ఈ సందర్భంగా స్లేమాన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుసుతూ ఆసుపత్రి వర్గాలు ప్రకటన వెలువరించాయి.
మరిన్ని అంతజాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.