హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మొయిజ్ ని కాల్చి చంపిన దుండగుల్లో 26 మంది కొలంబియా వాసులు, ఇద్దరు అమెరికన్లు ఉన్నట్టు హైతీ పోలీసులు తెలిపారు. ఈ నెల 7 న జోవెనెల్ ని ఆయన ఇంట్లోనే కాల్చి చంపగా.. ఈ ఘటనలో గాయపడిన ఆయన భార్య ఆసుపత్రి పాలయింది. ఈ హత్యకు పాల్పడినవారిలో 11 మందిని భద్రతా దళాలు తైవాన్ ఎంబసీలో పట్టుకోగా.. నలుగురు దుండగులను ప్రజలు వీధుల్లో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరిని ప్రజలు నెత్తురోడేలా కొడుతూ తాళ్లతో చేతులు కట్టేసి వీధుల్లో తిప్పారు. అయితే ఈ దేశాధ్యక్షుడిని హతమార్చాలని ఈ కిరాయి హంతకులను ఎవరు ఆదేశించారో ఇప్పటివరకు తెలియలేదు. వీరి నుంచి పెద్ద ఎత్తున రైఫిల్స్, కత్తులు, కొలంబియా పాస్ పోర్టులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు అధ్యక్ష భవనంలో వీరి చేతులను కట్టివేసి మీడియా ఎదుట హాజరు పరిచారు.హైతీలో ప్రస్తుతం అధికారం కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు.
అధ్యక్ష పదవి తమకే దక్కాలని తాత్కాలిక ప్రధాని క్లాడ్ జోసెఫ్ పట్టుబడుతుండగా..త్వరలో ఆయన స్థానే ఈ పోస్టును చేపట్టనున్న ఏరియల్ హెన్రీ కూడా ఈ పదవిని గట్టిగా ఆశిస్తున్నాడు. లోగడ జోవెనెల్ ఇతని అభ్యర్థిత్వంవైపే మొగ్గు చూపినట్టు తెలిసింది. ఈయనకు ప్రతిపక్షాల మద్దతు కూడా ఉంది. హైతీలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగా..ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా క్షీణించింది. రాజధాని పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ లో దోపిడీ దొంగలు యధేచ్చగా లూటీలకు పాల్పడుతున్నారు. ప్రజల ఇళ్లను దోచుకుంటున్నారు. వీరికి భయపడి గత కొన్ని వారాల్లో అనేకమంది ఇళ్ళు వదిలి పారిపోయారు.
మరిన్ని ఇక్కడ చూడండి: AP Weather Report: ఏపీకి భారీ వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారుల హెచ్చరికలు..