తాలిబన్లకు మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అస్సాంలోని 11 జిల్లాలకు చెందిన 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తేజ్ పూర్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఓ ఎంబీబీఎస్ విద్యార్ధి..మరో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఈ 14 మందిలో కొంతమంది నేరుగా తాలిబన్లను సమర్థించగా.. మరికొందరు తాలిబన్ టెర్రరిస్టులను సమర్థించని ఇండియా వైఖరిని విమర్శించారని ఆయన తెలిపారు. సోషల్ మీడియా నెట్ వర్కులపై నిరంతరం నిఘా పెట్టే అస్సాం పోలీస్ సైబర్ సెల్ రాడార్ లో వీరి కామెంట్లు స్పష్టంగా కనబడడంతో వీరిని అరెస్టు చేశారు. దేశ భద్రతకు హానికరమైనవాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం, తాలిబన్ల అనుకూల వ్యాఖ్యలు చేయడం నేరమని, ఇలాంటివారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అస్సాం డీఐజీ వయొలెట్ బరూహా హెచ్చరించారు. ఎవరి దృష్టికైనా ఈ విధమైన పోస్టులు వచ్చిన పక్షంలో పోలీసులకు సమాచారమివ్వాలని ఆయన కోరారు.
ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ టెర్రరిస్టు చర్యలను సమర్థించిన కనీసం 17 నుంచి 20 సోషల్ మీడియా ప్రొఫైల్స్ ని పోలీసులు కనుగొన్నారు. అస్సాంలోని 11 జిల్లాల నుంచే కాకుండా దుబాయ్, సౌదీ అరేబియా, ముంబై నుంచి కూడా తాలిబన్ అనుకూల కామెంట్లను వారు గుర్తించారు. రాష్ట్రం బయట సెటిలైన ముగ్గురు వ్యక్తుల వివరాలను కనుగొనే ప్రయత్నంలో పడ్డారు. వీటిని ఇంటెలిజెన్స్ బ్యూరోకు పంపుతామని అస్సాం పోలీసులు వెల్లడించారు. తాలిబన్లకు మద్దతు ప్రకటించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల సైబర్ విభాగాలు కూడా ఈ విధమైన పోస్టులను గుర్తించే యత్నంలో ఉన్నాయని వారు చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Chiranjeevi: చిరంజీవి బర్త్ డే ట్రీట్ వచ్చేసింది.. టైటిల్ పోస్టర్ రీలిజ్..
అన్నదొక దారి.. తమ్ముడిది మరో దారి.. తాలిబన్లకు మద్దతు ప్రకటించిన అష్రాఫ్ ఘని సోదరుడు హష్మత్ ఘని