భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. శత్రు దేశాలకు ఇక.. దబిడి దిబిడే
రష్యా భారత్‌కు Kh-69 స్టెల్త్ క్రూయిజ్ క్షిపణి సాంకేతికతను బదిలీ చేయాలని ప్రతిపాదించింది. సుఖోయ్-30MKI యుద్ధ విమానాల్లో వీటిని స్వదేశంలోనే ఉత్పత్తి చేయడం ద్వారా భారత వైమానిక దళ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. తేలికైన Kh-69 క్షిపణులు బ్రహ్మోస్‌తో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో మోసుకెళ్లడానికి వీలు కల్పిస్తాయి. ఇది మేక్ ఇన్ ఇండియా రక్షణ రంగానికి పెద్ద ఊతం.
భారత్‌కు చిరకాల మిత్ర దేశం రష్యా మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. మన సుఖోయ్-30MKI ఫైటర్ జెట్లలో ఉపయోగించేందుకు గానూ… రష్యా తన “Kh-69 స్టెల్త్ ఎయిర్-లాంచ్డ్ క్రూయిజ్” క్షిపణి టెక్నాలజీని బదిలీ చేసేందుకు పుతిన్ సర్కారు ప్రతిపాదించింది. తద్వారా, ఇకపై స్వదేశంలోనే ఈ క్షిపణులను తయారుచేసుకునే వీలు కలగనుంది. తద్వారా మన వైమానిక దళ సామర్థ్యం మరింత పెరగనుంది. 400 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ స్టెల్త్ క్షిపణి ..తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల వైమానిక రక్షణ వ్యవస్థల కన్నుగప్పి లక్ష్యాల మీద దాడిచేస్తుంది. 710 కేజీల బరువు గల ఈ క్షిపణిలో 310 కేజీల అధిక-పేలుడు వార్‌హెడ్ ఉంటుంది. ఈ క్షిపణిని టాక్టికల్ మిస్సైల్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఇటీవలి ఉక్రెయిన్ యుద్ధంలోనూ రష్యా ఈ క్షిపణిని ప్రయోగించింది. ఇందులోని గైడెడ్ వ్యవస్థ, ఇనర్షియల్ నావిగేషన్, గ్లోనాస్ GPSతో పాటు ఎలక్ట్రో-ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సీకర్ మూలంగా ఈ క్షిపణి ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. ప్రస్తుతం మన వైమానిక దళంలోని సుఖోయ్-30MKI యుద్ధ విమానాల్లో బ్రహ్మోస్-ఎ సూపర్ సోనిక్ క్షిపణులను అమర్చి ప్రయోగిస్తున్నారు. దీని రేంజ్ 290 – 450 కి.మీ పరిధిని కలిగి ఉంటుంది. అయితే బ్రహ్మోస్ బరువు దాదాపు 2,500 కిలోలు. అంటే ఇది ఒకేసారి ఒకటి లేదా రెండు క్షిపణులను మాత్రమే మోసుకెళ్లడానికి వీలు కల్పిస్తుంది. రష్యా అందించే Kh-69 మిస్సైల్ బ్రహ్మోస్‌తో పోల్చితే తేలికైనది. సుఖోయ్ ఫైటర్ జెట్లు ఒకేసారి నాలుగు క్షిపణులను మోసుకెళ్లడానికి వీలుంటుంది. ఇక.. ఈ ప్రతిపాదన ప్రకారం.. భారత్ కనీసం 200 నుంచి 300 క్షిపణుల కొనుగోలుకు ఆర్డర్ పెట్టనుంది. అప్పుడు రష్యా కొన్ని క్షిపణులను అక్కడి నుంచి ఎగుమతి చేస్తూనే.. దేశీయంగా మనం తయారు చేసుకోవటానికి వీలుగా వాటి టెక్నాలజీ, బ్లూప్రింట్ మనకు అందిస్తుంది. భారత్‌లో వీటిని తయారు చేసేందుకు రష్యా..హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వంటి సంస్థలను తమ భాగస్వాములుగా ఎంచుకునే అవకాశం ఉంది. ఈ క్షిపణుల డీల్ అమలులోకి వస్తే..చైనా, పాకిస్థాన్ సరిహద్దులో మన వాయుసేన సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అయితే అమెరికా ఆంక్షలు, పశ్చిమ దేశాలతో భారతదేశానికి పెరుగుతున్న రక్షణ సహకారం నేపథ్యంలో .. 2026 ప్రారంభంలో భారత ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే రష్యా ఆఫర్ భారతదేశానికి ఒక ప్రధాన వ్యూహాత్మక అవకాశంగా పరిగణించవచ్చు. ఇది మేక్ ఇన్ ఇండియా సంకల్పానికి సైతం ఊతమిస్తోంది. భారత వైమానిక దళంలో ఉన్న సుఖోయ్ ఫైటర్ జెట్ల సామర్థ్యాన్ని సైతం పెంచుతుంది. అలాగే లాంగ్ రేంజ్ స్టెల్త్ ఎటాక్ సామర్థ్యాన్ని సైతం గణనీయంగా మెరుగుపరుస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడిరోడ్డుపై వ్యక్తి పరుగులు.. ప్లాన్డ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
మన అనకాపల్లి అమ్మాయే.. వరల్డ్ కప్ క్రికెట్ కామెంటేటర్
కాలు నొప్పిగా ఉంది.. వైద్యం చేయమని అడిగిన వీధి కుక్క.. వీడియో వైరల్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

