భార్య ఆరోగ్యం బాగాలేక మూడేళ్ల ముందే వీఆర్ఎస్.. రిటైర్మెంట్ ఫంక్షన్‌లోనే భార్య మృతి.. షాకింగ్ వీడియో!
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భార్య కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు ఆమె భర్త. భర్త రిటైర్మెంట్ ఫంక్షన్‌లోనే భార్య ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. గుండె సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతోందని కుటుంబసభ్యులు తెలిపారు.
అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఆదుకునేందుకు భర్త పదవీ విరమణ చేస్తున్న క్రమంలో రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో ప్రమాదం జరిగింది. ఆఫీస్‌లో జరుగుతున్న రిటైర్మెంట్ ఫంక్షన్‌లో అందరూ సంబరాలు నిర్వహించుకుంటూ ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నారు. ఆ తర్వాత భార్య ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటన మొత్తం రాజస్థాన్ ప్రజలను కుదిపివేసింది.
అధికారుల ప్రకారం, దేవేంద్ర శాండల్ సెంట్రల్ వేర్‌హౌస్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పదవీ విరమణకు మూడేళ్ల ముందు వీఆర్‌ఎస్ తీసుకున్నాడు. మంగళవారం(డిసెంబర్ 24) కార్యాలయంలో చివరి రోజు. అందుకే సహోద్యోగులు పార్టీని ఏర్పాటు చేశారు. దేవేంద్రతోపాటు అతని భార్య దీపిక అలియాస్ టీనా కూడా కార్యాలయానికి వచ్చారు. టీనాకు పూలమాల వేసిన కొద్ది క్షణాలకే ఆమె కూర్చున్నప్పుడు కుర్చీలోంచి కిందపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరు కంటి తడ పెట్టుకుంటున్న పరిస్థితి భర్తని ఓదార్చడం ఎవరివల్ల కాలేదని సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు నెటిజన్లు. తన భార్య ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆ ఉద్యోగి మూడేళ్లు ముందుగానే వీఆర్ఎస్ తీసుకున్నాడు. ఊహించని విధంగా భర్త రిటైర్మెంట్ ఫంక్షన్‌లోనే భార్య చనిపోవడం విషాదంగా మారింది.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..