Viral Video: సమాజం శాస్త్రసంకేతికంగా ఎంతో ఎదుగుతోంది. మనిషి చంద్రుడిపై నీటి జాడను వెతికేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ భూమిపై నీరు అందని పరిస్థితులు ఇంకా ఉన్నాయి. నీరు ఎక్కువై ఏం చేసుకోవాలో తెలియని వారు కొందరు ఉంటే, నీరు అందక నానా కష్టాలు పడుతున్న వారు మరికొందరు. గుక్కెడు నీటి కోసం మైళ్ల దూరం నెత్తిన బిందెలతో వెళ్లే మహిళలకు సంబంధించిన దృశ్యాలు అడపాదపడా కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఓ చోట నీటి కోసం ఏకంగా ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. గుక్కెడు నీటి కోసం బావిలోకి దిగుతున్నారు.
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని గూసియా గ్రామంలో నీటి ఎద్దడి ఉంది. మరీ ముఖ్యంగా వేసవి కావడంతో నీటి కష్టాలు తారా స్థాయికి చేరాయి. దీంతో గుక్కెడు మంచి నీటి కోసం మహిళలు పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది. ప్రమాదకర రీతిలో బావిలోకి దిగి అడుగున ఉన్న కాస్తంతా నీటితో గొంతు తడుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో అడుగుల లోతులోకి దిగుతూ మహిళలు తమ ప్రాణాలు సైతం పణంగా పెడుతోన్న ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీశాయి. ఈ మహిళల సాహసం చూసి ఆశ్చర్యపోవాలా, గుక్కెడు నీటిని అందించని ప్రభుత్వాలను విమర్శించాలా అర్థం కాని పరిస్థితి ఉంది.
#WATCH | Madhya Pradesh: People in Dindori’s Ghusiya village risk their lives to fetch water from an almost dry well pic.twitter.com/jcuyLmE5xL
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 2, 2022
తమ ప్రాంతంలో నెలకొన్ని నీటి ఎద్దడి గురించి గ్రామానికి చెందిన మహిళలు మాట్లాడుతూ.. మంచి నీటి కోసం నిత్యం సాహసాలు చేయాల్సి వస్తోందని, బోర్లు ఉన్నా నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. గ్రామంలో ఉన్న మూడు బావుల్లో దాదాపుగా నీరు అడుగుంటిందని, ఆ కాస్త ఎండిపోతే బతకలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు కేవలం ఎన్నికల ముందు మాత్రమే వస్తారని, ఈసారి నీటి సరఫరా అందించే వరకు ఓట్లు వేయకూడదని నిర్ణయించుకున్నట్లు గ్రామ మహిళలు తేల్చి చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..