Conductor Hitting Passenger: ఆర్టీసీ బస్సుల్లో తాగుబోతు ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా మహిళా కండక్టర్ల పట్ల విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా మద్యం బాబులు రెచ్చిపోతున్నారు. అయితే, వరంగల్ జిల్లాలో ఇలాంటి ఆకతాయికి తగిన గుణపాఠం చెప్పింది ఓ మహిళా కండక్టర్. పీకల దాకా మద్యం తాగాడు.. ఆపై ఆర్టీసీ బస్సెక్కాడు. టికెట్ తీసుకోకుండా ఎకసెక్కాలాడాడు. మహిళా కండక్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. మొదట్లో సహనంతో భరించిన మహిళా కండక్టర్.. మందుబాబు వేషాలు శృతిమించడంతో చెప్పుతో సమాధానమిచ్చింది. వరంగల్ జిల్లా వర్దన్నపేటలో జరిగిందీ ఘటన.
వర్దన్నపేట ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో తొర్రూర్ వెళ్తున్న బస్‌లో ఎక్కాడు మందుబాబు. వాడి వాలకాన్ని గమనించిన మహిళా కండక్టర్.. చాలా మర్యాదగా మాట్లాడుతూ టికెట్ తీసుకోవాలని కోరింది. కానీ ఆ తాగుబోతు మాత్రం వెకిలి నవ్వులతో అసభ్యంగా ప్రవర్తించాడు. కోపం పట్టలేని మహిళా కండక్టర్.. మందుబాబుని బస్సులోంచి దింపేసి చెప్పుతో కొట్టింది. పోలీసులకు సమాచారం అందించేలోపే అక్కడినుంచి పరారయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.